'లక్సెంబర్గ్'తో డబుల్.. చైనాను వదిలే కంపెనీలకు ఇండియా ఆఫర్! ఆంధ్రప్రదేశ్‌తో ఆ కంపెనీల చర్చలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో చైనా నుండి పలు కంపెనీలు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కంపెనీల్ని ఆకర్షించేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా నుండి వచ్చే కంపెనీల కోసం కొన్ని ప్రభుత్వాలు ప్యాకేజీని సిద్ధం చేసుకున్నారు. అమెరికా సహా వివిధ దేశాలకు చెందిన కంపెనీలు చైనాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు భారత్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. భారత్‌కు ఇది మంచి అవకాశమని, చైనా నుంచి తరలి వెళ్లే సంస్థలను ఆకర్షించాలని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశలోనే ఆలోచన చేస్తోంది.

లక్సెంబర్గ్ కంటే రెండు రెట్లు
చైనా నుంచి వచ్చే కంపెనీలకు భారత్ స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. లక్సెంబర్గ్ దేశ విస్తీర్ణంతో పోలిస్తే రెట్టింపు రెట్టింపు భూమిని కేటాయించేందుకు, తద్వారా డ్రాగన్ కంట్రీని వీడాలనుకున్న కంపెనీలను ఆకర్షించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం లక్సెంబర్గ్ 2,43,000 హెక్టార్లలో ఉంది. పరిశ్రమల కోసం భారత్ 4,61,589 హెక్టార్ల స్థలాన్ని గుర్తించిందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సహా ఇక్కడ భూమి.. ఇదే అతిపెద్ద సమస్య
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 4,61,589 హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పారిశ్రామిక స్థలం ఉందని తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని చూసే కంపెనీలకు స్థలం అతిపెద్ద అడ్డంకిగా మారింది. సౌదీ ఆరామ్‌కో నుండి పోస్కో వరకు ల్యాండ్ అక్వైజేషన్‌కు సంబంధించి భూమి ఇబ్బందులతో విస్తరించలేకపోయాయి.జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ చర్చలు జరుపుతోంది. భారీగా సముద్రతీరం కలిగి ఉండటంతో పాటు రెండీమెడ్ పారిశ్రామిక పార్కులు పెట్టుబడుల ఆకర్షణకు తోడ్పడుతాయని భావిస్తున్నారు.

భూసేకరణపై మోడీ బృందం దృష్టి
కరోనా కారణంగా ఇప్పుడు చైనా నుండి కంపెనీలు బయటకు రావాలనుకోవడం భారత్‌కు సువర్ణావకాశంగా భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, నిపుణులు. అందుకే ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాని మోడీ అధికార బృందం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి స్థల సేకరణకు పని చేస్తోంది.విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక వివరణాత్మక స్కీం ఈ నెలాఖరు వరకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.

ఇవి సమకూర్చితే పెట్టుబడులు వచ్చే అవకాశం
ప్రస్తుతం కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సొంతగా భూములు సమకూర్చుకోవాలి. ఇది వారికి చాలా కష్టంగా మారడంతో పాటు ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమవుతోంది. భూమి సేకరించుకోవడంతో పాటు కరెంట్, వాటర్, రోడ్డు వంటి సదుపాయాలు కల్పిస్తే పెట్టుబడులు ఆకర్షించడం సులభం అవుతుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. తమతో పాటు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసం తమవంతు ప్రయత్నాలు చేయాలని కేంద్రం చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.

కంపెనీలు ఆసక్తి
ఎలక్ట్రికల్స్, ఫార్మా, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, హెవీ ఇంజినీరింగ్, సోలార్ ఎక్విప్‌మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, టెక్స్ టైల్స్ వంటి పది రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్‌ను ప్రమోట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు విదేశాల్లోని రాయబార కార్యాలయాలను కూడా సమాచారం కోరింది. ప్రభుత్వ పెట్టుబడుల ఏజెన్సీ ఇన్వెస్ట్ ఇండియాకు జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, చైనాల నుండి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications