హైరింగ్ అదుర్స్, ఎనిమిదేళ్ల గరిష్టానికి నియామకాలు
కరోనా మహమ్మారి అనంతరం ఇటీవల దేశంలో జాబ్ హైరింగ్ లేదా నియామకాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలై నుండి సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో నియామకాలు గత ఎనిమిదేళ్లలో లేనంత ఆశావహంగా కనిపిస్తోందని మ్యాన్ పవర్ గ్రూప్ వెల్లడించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ కార్మిక సేవల కంపెనీ ఓ సర్వేను నిర్వహించింది.
సర్వేలో పాల్గొన్న 63 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలల్లో మరింత మంది ఉద్యోగులను చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. మరో 12 శాతం యాజమాన్యాలు ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. దీంతో నికర నియామకాల జోరు 51 శాతంగా నమోదయిందని, అయినప్పటికీ ఇది ఎనిమిదేళ్ల గరిష్టమని పేర్కొంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో భారత్ అత్యధిక హైరింగ్ సెంటిమెంటును కలిగి ఉందని తెలిపింది.

సింగపూర్ 40 శాతం, ఆస్ట్రేలియా 38 శాతం ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు వంటి సవాళ్ల నేపథ్యంలో భారత్‌లోని అన్ని రంగాల్లో సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. దేశంలోని 3000కు పైగా సంస్థలను సర్వే చేసింది ఈ సంస్థ. అత్యధికంగా ఐటీ, టెక్నాలజీ రంగంలో 68 శాతం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్, రియాల్టీ రంగాల్లో 60 శాతం, ఇతర సేవల్లో 52 శాతం, హోటల్ అండ్ రెస్టారెంట్ 48 శాతం, తయారీ రంగంలో 48 శాతం డిమాండ్ ఉంటుందని తెలిపింది.


Click it and Unblock the Notifications