కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నుండి నియామకాలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. జూన్ నుండి కార్యకలాపాలు క్రమంగా పెరగడంతో మన దేశంలో నియామకాలు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షల తొలగింపు అనంతరం ఇండియాలో నియామకాలు గణనీయంగా పుంజుకున్నాయని లింక్డిన్ నివేదిక వెల్లడించింది.

నియామకాలు పెరిగాయి కానీ...
ఏప్రిల్ ప్రారంభం నుండి జూన్ చివరి నాటికి నియామకాలు 35 శాతం మేర పెరిగాయని లేబర్ మార్కెట్ అప్ డేట్ నివేదికలో తెలిపింది. అయితే ఈ పరిస్థితి ముందు ముందు కొనసాగకపోవచ్చునని, ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనిశ్చితి కారణంగా నియామకాలు రానున్న కొద్ది నెలల్లో స్తబ్దుగా ఉండేందుకు అవకాశముందని పేర్కొంది.

ఉద్యోగ పోటీ రెండింతలు
దేశంలోని ఉద్యోగార్థులతో పోలిస్తే అందుబాటులోని ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆన్‌లైన్ పోర్టల్ లింక్డిన్ పేర్కొంది. ఈఏడాది ప్రథమార్థం జనవరి నుండి జూన్‌లో ఉద్యోగాల కోసం పోటీ రెట్టింపయిందని తెలిపింది. తమ వెబ్ సైట్ పోస్ట్ చేసిన ఒక్కో ఉద్యోగానికి జనవరిలో 90 మంది చొప్పున దరఖాస్తు చేసుకోగా, జూన్ నెలకు ఇది 180కి పెరిగినట్లు లింక్డిన్ తెలిపింది. లాక్ డౌన్‌తో జాబ్ మార్కెట్ పైన ప్రభావం తీవ్రంగా పడిందని వెల్లడించింది.

ఖర్చులు తగ్గించుకునే క్రమంలో..
కరోనా కారణంగా ఆదాయం లేకపోవడంతో చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగించడం, జీతాల్లో కోత విధించడం వంటి చర్యలు చేపట్టాయి. కొన్ని కంపెనీలు సిబ్బందిని వేతనంలేని సెలవులపై ఇంటికి పంపించాయి. దాంతో కొత్త ఉద్యోగాల కోసం వెతికే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు లింక్డిన్ తెలిపింది. లాక్ డౌన్ సడలింపులతో నియామకాలు పెరిగాయని ఏప్రిల్ ప్రారంభం నుండి జూన్ చివరి నాటికి 35 శాతం పెరిగినట్లు తెలిపింది.

50 శాతం పడిపోయి.. 15 శాతం మెరుగు
లింక్డిన్ తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్‌లో నియామకాలు ఏడాది ప్రాతిపదికన 50 శాతం పడిపోగా, జూన్ చివరి నాటికి 15 శాతం మెరుగుపడ్డాయని నివేదిక పేర్కొంది. కరోనా మళ్లీ వ్యాప్తిస్తుందనే ఆందోళనలతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ మళ్లీ ప్రకటించాయి. దీంతో జాబ్ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడినట్లు తెలిపింది. మరికొన్ని రోజుల పాటు నియామకాల రికవరీ స్తబ్దుగా ఉండనుందని తెలిపింది.


Click it and Unblock the Notifications