జీఎస్టీ వార్షిక రిటర్న్స్ గడువు అక్టోబర్ చివరి వరకు పొడిగింపు
2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్న్స్ ఫైలింగ్ గడువును ప్రభుత్వం ఒక నెల పొడిగించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం నుండి అనుమతులు పొందిన అనంతరం 2018-19 ఏడాదికి గాను జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9సీ వార్షిక రిటర్న్స్ గడువు తేదీని ప్రభుత్వం 30-09-2020 నుండి 31-10-2020 వరకు పొడిగించినట్లు సీబీఐసీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ గడువును మే నెలలో సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఇప్పుడు మరో నెల రోజులు పొడిగించింది.
జీఎస్టీ వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్స్ దాఖలు గడువు పొడిగింపు ఎంతోమందికి ఊరట. అయితే ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు పొందిన తర్వాత ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఈ అనుమతుల మేరకే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9సీ వార్షిక రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో 2019-20 ఆర్థిక అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీ రిటర్న్స్) దాఖలుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బుధవారం తెలిపింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన FY20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలుకు గడువును సీబీడీటీ గతంలో జూన్ 30వ తేదీకి పొడిగించిన విషయం తెలిసిందే. మొదటిసారి జూలై 31కి, రెండోసారి సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించింది. ఇప్పుడు ఆ గడువును నవంబర్ 30వ తేదీకి పొడిగించింది.


Click it and Unblock the Notifications