100 మందికి పైగా ఉద్యోగులున్నా: PFపై శుభవార్త ఉంటుందా? శాలరీ ఇస్తేనే.. కంపెనీలకు హెచ్చరిక!
కరోనా మహమ్మారి కారణంగా 100లోపు ఉద్యోగులు ఉండి, 90 శాతం 15,000 లోపు శాలరీ ఉంటే పీఎఫ్ తామే చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం మొత్తం 24 శాతం తామే చెల్లిస్తామని కేంద్రం తెలిపింది. తాజాగా అదనపు ప్రయోజనంపై కేంద్రం కసరత్తు చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. 100 మందికి పైగా కార్మికులు ఉన్నప్పటికీ, ఈ ప్రయోజనం కల్పించే అంశం ఆలోచిస్తోంది.

200 మంది ఉద్యోగుల వరకు..
100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ ప్రావిడెంట్ ఫండ్‌ను తామే చెల్లించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందట. అయితే ఈ పథకం కేవలం తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రతిపాదన ఉందని, కానీ ఇంకా వివరాలు రాలేదని, నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. 200 మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ రూ.15,000 వేతనం వరకు ఉన్న ఉద్యోగులు 90 శాతం ఉంటే ఇది వర్తించే అవకాశాలు పరిశీలిస్తోంది.

100 లోపు 60 శాతం, 200 లోపు 90 శాతం
ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఇప్పటి వరకు 90 శాతం మంది ఉద్యోగులు 15,000 లోపు ఉండాలి. కానీ దీనిని 60 శాతం ఉద్యోగులకు మార్చే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇక 200 ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో 90 శాతం ఉద్యోగులు రూ.15,000 శాలరీ లోపు ఉండాలనే నిర్ణయం తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది.

ఉద్యోగులకు పూర్తి శాలరీ ఇస్తేనే..
రాయితీ పొందే సంస్థలు వేతనాలను చెల్లించి ఆ వివరాలన్ని కార్మిక శాఖకు సమర్పించాలి. ఈసీఆర్‌లను సమర్పించిన అనంతరమే కార్మిక శాఖ అధికారులు వాటిని పరిశీలించి ఉద్యోగుల ఈపీఎఫ్ చందాను వారి యూఏఎన్ నెంబర్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ క్రమంలో రాయితీ పొందే ప్రతి కంపెనీ ఉద్యోగికి పూర్తి వేతనాన్ని చెల్లించవలసి ఉంటుంది.

విధులకు హాజరు కాకపోయినా వేతన చెల్లింపులు
లాక్ డౌన్ సమయంలో కేంద్రం ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ వేతనాలు చెల్లించాలి. కొన్ని కంపెనీలు పని చేసిన కాలానికే వేతనాలు చెల్లిస్తున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. వీటిపై కార్మికులు లేదా ఉద్యోగులు కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తే కార్మిక చట్టాల ప్రకారం ఆ కంపెనీలపై చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్ లేబర్ కమిషనర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications