గుడ్‌న్యూస్: జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ గడువు 3 నెలలు పొడిగింపు
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా లాక్ డౌన్‌ను పొడిగిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల మూడోసారి మే 17వ తేదీ వరకు పొడిగించారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉద్యోగాలకు చాలామందికి వేతనాలు లేవు. దీంతో ఈఎంఐ నుండి వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సామాన్యులకు ఊరట కల్పిస్తోంది.
తాజాగా వార్షిక జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్‌కు సంబంధించి కూడా గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని మూడు నెలలు పొడిగించి సెప్టెంబర్ 2020 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) మార్చి 24 లేదా అంతకుముందు బిల్లులకు సంబంధించిన ఈ-వే బిల్స్ వ్యాలిడిటీని పొడిగించింది. సాధారణంగా అయితే ఈ గడువు మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీకి ముగిసింది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ రిటర్న్స్ కాలపరిమితిని 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని నోటిఫికేషన్ జారీ చేసినట్లు CBIC ఓ ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోందని, కొన్నిచోట్ల పాక్షికంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పొడిగింపు పరిశ్రమకు ఎంతో ఊరట కలిగించే అంశమని ఈ రంగానికి సంబంధించిన వారు చెబుతున్నారు. CBIC గత నెలలో మార్చి 24 లేదా అంతకుముందు జనరేట్ అయిన ఈ-వే బిల్లులకు సంబంధించిన వ్యాలిడిటీని పొడిగించింది. లాక్ డౌన్ పొడిగింత దృష్ట్యా దీనిని మే 31వ తేదీ వరకు పొడిగించారు.


Click it and Unblock the Notifications