భారీగా తగ్గిన బంగారం డిమాండ్: ఉద్యోగాల కోతతో.. లాక్‌డౌన్ తర్వాత ఇదే పరిస్థితి
2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 14.23 శాతం తగ్గి 28.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది పసిడి దిగుమతులు 32.91 బిలియన్ డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు దాదాపు పదిహేను శాతం తగ్గడంతో దేశీయ వాణిజ్య లోటు 152.88 బిలియన్ డాలర్లకు తగ్గడానికి తోడ్పడింది. అంతకుముందు ఏడాది ఇది 184 బిలియన్ డాలర్లుగా ఉంది.

పడిపోయిన దిగుమతులు
గత ఏడాది డిసెంబర్ నుండి బంగారం దిగుమతులు క్రమంగా నెగిటివ్ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఇండియాలో ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. కాబట్టి ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ పసిడి దిగుమతి చేసుకునేది మన దేశమే. భారత్ ప్రతి ఏడాది దాదాపు 800 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 11 శాతం పడిపోయి 35.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

గత 3 నెలల్లోనే సగానికి పైగా తగ్గిన దిగుమతులు
ఏడాది మొత్తం కంటే నాలుగో క్వార్టర్‌లోనే బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. లాక్ డౌన్ కారణంగా పసిడి వినియోగం తగ్గింది. దాంతో జనవరి-మార్చి క్వార్టర్‌లో బంగారం దిగుమతులు 55% తగ్గాయి. లాక్ డౌన్, ధరలు అంతకంతకూ పెరగడం ఇందుకు కారణం.

మూడు దశాబ్దాల కనిష్టానికి బంగారం వినియోగం
ఎగుమతులు, దిగుమతులే కాదు.. లాక్ డౌన్ కారణంగా బంగారానికి కూడా డిమాండ్ భారీగానే పడిపోయింది. ఈ ఏడాది మన దేశంలో పసిడి వినియోగం గత ఏడాదితో పోలిస్తే 50% తగ్గనుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ తెలిపారు. గత ఏడాది 690.4 టన్నుల పసిడి వినిమయం ఉండగా, ఈసారి వినియోగం మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

పండుగలు, పెళ్లిళ్ళ సీజన్
వినియోగం 1991 నాటి 350 టన్నుల నుండి 400 టన్నుల మధ్య పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో లాక్ డొన్ కొనసాగుతోంది. ప్రస్తుతం బంగారం కొనలేని పరిస్థితులు. బంగారానికి కీలకమైన ఇలాంటి సీజన్‌లో లాక్ డౌన్ ఉండటంతో కొనుగోళ్లు క్షీణించాయి.

లాక్ డౌన్ తర్వాత ఖర్చులకు దూరంగా ప్రజలు
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కొంతకాలం బంగారానికి డిమాండ్ ఉండదని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత, వేతన జీవులకు శాలరీ తగ్గడం వంటి వివిధ కారణాలతో ప్రజలు ఖర్చుకు కొంతకాలం దూరంగా ఉండే అవకాశముంది. కాబట్టి బంగారానికి డిమాండ్ పెరగకపోవచ్చునని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications