విప్రోకు 5గురు మాజీ ఉద్యోగులు ఝలక్, అమెరికాలో క్లాస్ యాక్షన్ కేసు
వాషింగ్టన్: ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఇండియన్ సాఫ్టువేర్ దిగ్గజం విప్రోపై అమెరికాలో ఐదుగురు మాజీ ఉద్యోగుల బృందం క్లాస్ యాక్షన్ దావా వేశారు. దక్షిణాసియా, భారతీయ మూలాలు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కొర్టులో దాఖలు చేసిన కేసులో ఆరోపించింది. మొత్తం అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12 కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80 శాతం మంది ఉన్నారని, ఇందులో ప్రధానంగా భారతీయులు ఉన్నారని పేర్కొంది.

అమెరికాలో 14,000 మంది ఉద్యోగులు
దక్షిణాసియేతర, ముఖ్యంగా భారతీయేతర ఉద్యోగులపై విప్రో వివక్ష చూపిస్తోందని ఈ బృందం ఆరోపించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విప్రోలో మొత్తం 1.60 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. అందులో 14,000 మందికి పైగా అమెరికాలోని కంపెనీ కార్యాలయాల్లో పని చేస్తున్నారు.

దావా వేసింది వీరే..
విప్రో సంస్థలో పని చేసిన గ్రెగోరీ మాక్లీన్ (కాలిఫోర్నియా), రిక్ వాలెస్ (కాలిఫోర్నియా), అర్దేశీర్ పెజెష్కి (కాలిఫోర్నియాలో ఉండే ఇరానియన్), జేమ్స్ గిబ్స్ (టెన్నెస్సీ), రొనాల్డ్ హేమెన్వే (ఫ్లోరిడా) అనే ఐదుగురు మాజీ ఉద్యోగులు ఈ లా సూట్ దాఖలు చేశారు. ఇందులో నలుగురు ఉద్యోగులు అమెరికన్ సంతతికి చెందిన వారు. మరొకరు ఇరానియన్. ఇతను ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

ఆరోపణలు ఇవీ..
విప్రో దక్షిణాసియన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని వారు ఆరోపించారు. అందుకే తాము ఉద్యోగాలు కోల్పోయామని ఆరోపించారు. దక్షిణాసియన్లు, భారతీయులు కాని వారికి అప్రైజల్ స్కోర్స్ ఇవ్వడం లేదని, వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో ఎక్కువ సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని పేర్కొంది. ఉద్యోగుల పదోన్నతులు, జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి బేధం చూపిస్తున్నారని ఆరోపించింది.

స్పందించేందుకు విప్రో నో
ప్రస్తుతం దావా న్యాయస్థానం పరిధిలో ఉన్నందున విప్రో ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించింది. గత ఏడాది డిసెంబర్‌లోను ఓ ఉద్యోగి ఇలాంటి దావా వేశారు.


Click it and Unblock the Notifications