న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై సమీక్షించారు. దెబ్బతిన్న రంగాలను పునరుద్ధరించేందుకు రెండో భారీ ప్యాకేజీ పథకం ప్రకటించడంపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లోని ప్రజలకు ఉచిత గ్యాస్, ఉచిత బియ్యం, పప్పు వంటి వాటి కోసం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని గత నెలలో ప్రకటించారు.

వీటిని ఆదుకోవాలి
కరోనా కారణంగా చిన్న తరహా పరిశ్రమల నుండి విమానయాన రంగం వరకు కుదేలయ్యాయి. వేలకోట్లు నష్టపోయాయి. లక్షల ఉద్యోగాలకి ముప్పు వాటిల్లింది. ఈ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మల దృష్టి సారించారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన నిధుల సమీకరణ పైన కూడా చర్చించారని తెలుస్తోంది.

లాక్ డౌన్ తర్వాత వేగంగా పట్టాలెక్కించేందుకు..
లాక్ డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను సాధ్యమైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ఏం చేయాలనే అంశంపై కూడా కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. పేదలకు, వివిధ వర్గాలకు ఏ విధంగా సంక్షేమ, సహాయ చర్యలు చేపట్టాలో సలహాలు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో నిర్మల భేటీ అయ్యారు.

అన్ని రంగాలపై ప్రభావం
ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, ఆతిథ్యం, ఆటో, పౌర విమానయానం ఇలా అన్ని రంగాలు కరోనా బారినపడి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్నాయి. ఈ మహమ్మారి కారణంగా బారత జీడీపీ కూడా దారుణంగా పడిపోతుందని వివిధ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి.

రెండో ప్యాకేజీ... ఎంత?
మోడీ ప్రభుత్వం తొలి విడత ప్యాకేజీగా రూ.1.70 లక్షల కోట్లు ప్రకటించింది. వివిధ రంగాలు గట్టెక్కేందుకు రూ.10 లక్షల కోట్ల నుండి దీర్ఘకాలంలో రూ.22.5 లక్షల కోట్లు అవసరమని వివిధ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తులు కూడా చేశారు. రెండో ప్యాకేజీ ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుందనేది కీలకంగా మారింది.


Click it and Unblock the Notifications