కరోనా వైరస్ - లాక్‌డౌన్ ప్రభావం ఎగుమతులపై భారీగా పడింది. ఏప్రిల్ నెలలో ఎగుమతులు 60.28 శాతం తగ్గి 10.36 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మన కరెన్సీలో రూ.78,000 కోట్లకు తగ్గింది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ప్రకారం దిగుమతులు కూడా 58.65 శాతం తగ్గి 41.4 బిలియన్ డాలర్ల నుండి 17.12 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మన కరెన్సీలో రూ.1.28 లక్షల కోట్లు. దీంతో వాణిజ్య లోటు నాలుగేళ్ల కనిష్టానికి చేరుకుంది.

వాణిజ్య లోటు
శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో భారత ఎగుమతులు ఏకంగా 60.28 శాతం తగ్గాయి. 2011-12 నుంచి భారత ఎగుమతులు ప్రతి నెలా 30 వేల కోట్ల డాలర్లకు అటు ఇటుగా ఉంటున్నాయి. ఏప్రిల్ నెల ఎగుమతుల విలువ 1,036 కోట్ల డాలర్లు లేదా రూ.78,000 కోట్ల మాత్రమే. వాణిజ్య లోటు గత ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే 1,533 కోట్ల డాలర్ల నుండి 676 కోట్ల డాలర్లకు తగ్గింది. మన కరెన్సీలో రూ.1.15 లక్షల కోట్ల నుండి రూ.50,700 కోట్లు.

ఈ ఎగుమతులు తగ్గాయి
2016 మే నెల తర్వాత వాణిజ్య లోటు కనిష్ఠం ఇదే. ఎగుమతులు భారీ క్షీణత నమోదు చేయడం వరుసగా ఇది రెండో నెల. మార్చిలో ఎగుమతులు 34.57% తగ్గాయి. ఏప్రిల్ నెల ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాలు 98.74 శాతం, తోళ్లు 93.28 శాతం, పెట్రోలియం ఉత్పత్తులు 66.22 శాతం, ఇంజినీరింగ్ పరికరాలు 64.76 శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. గత నెలలో చమురు దిగుమతులు 59.03 శాతం మేర తగ్గి (2019 ఏప్రిల్‌తో పోలిస్తే) 4.66 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇనుప ఖనిజం, పార్మా విభాగాలు తప్పితే మిగతా 28 రంగాల ఎగుమతుల్లో ప్రతికూలత నమోదయింది.

సేవల రంగం పెరిగిన ఎగుమతుల విలువ
ఇదిలా ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎగుమతుల విలువ 214.61 బిలియన్ డాలర్లు అని ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2018-19తో పోల్చితే ఇది 4.3% పెరుగుదల. ఈ రంగం దిగుమతుల విలువ ఈ కాలం లో 131.56 బలియన్ డాలర్లు. మార్చి నెలలో ఎగుమతులు 18.16 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి. ఇదే నెలలో సేవల దిగుమతులు 11.11 బిలియన్ డాలర్లు.


Click it and Unblock the Notifications