దిగుమతుల దెబ్బ, అమెరికా సహా విదేశాల నుండి రాని కంటైనర్లు, ధరలు రెండింతలు
కరోనా మహమ్మారికి తోడు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా వైరస్ కారణంగా గత ఆరు నెలలుగా దిగుమతులు పడిపోయాయి. స్వదేశీ తయారీ దీనికి తోడై, దిగుమతులు గతంలో వలె పుంజుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు కంటైనర్ల కొరతను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎగుమతుల భారం కూడా వారికి అధికమైంది. దిగుమతులు దాదాపు 19.6 శాతం మేర క్షీణించాయి. దీంతో కంటైనర్లు భారత్‌కు తక్కువగా తిరిగి వచ్చి, ఎగుమతులకు ఇబ్బందికరంగా మారింది.

అమెరికా, ఆఫ్రికా, యూరోప్‌లకు పంపించాలంటే..
కంటైనర్ల కొరత ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో అంతర్జాతీయ రవాణా మార్గాల్లో సరుకు రవాణా రేట్లు పెరగడానికి కారణం అవుతోంది. కంటైనర్లు స్వదేశానికి తక్కువగా తిరిగి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఎగుమతుల నేపథ్యంలో ఖాళీ కంటైనర్లను తిరిగి భారత్‌కు రప్పించేలా చొరవ తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్(FIEO) ప్రభుత్వాన్ని కోరింది. కంటైనర్ల కొరత కారణంగా గత మూడు నెలల కాలంలో అమెరికాకు ఎగుమతుల కోసం 60 శాతం ధరలు పెరిగాయి. ఆఫ్రికన్ ఓడ రేవులకు ఎగుమతి చేయడానికి రెండింతలు దాటిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరోప్‌కు ఎగుమతి చేయడానికి కంటైనర్ ధరలు 50 శాతం పెరిగాయి.

భారీగా పెరిగిన కంటైనర్ ధర
ఎగుమతుల కోసం ఈ మూడు నెలల కాలంలో సగటున 50 శాతం పెరిగాయని FIEO ప్రెసిడెంంట్ శరద్ కుమార్ సరఫ్ అన్నారు. పరిస్థితి ఇప్పటికీ మెరుగు పడటం లేదని, ఇందుకు ఒకటే మార్గం ఉందని, ఖాళీ కంటైనర్లను తిరిగి రప్పించేలా ఇండియన్ మారీటైమ్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎగుమతుల కోసం సరుకు నింపేందుకు కంటైనర్లు లేకుండా పోయాయని, ఇది చాలా తీవ్రమైన సమస్య అన్నారు. కంటైనర్లు లేకపోవడంతో షిప్పింగ్ కంపెనీలు ధరలు పెంచాయని తెలిపారు. జైపూర్‌కు చెందిన లాజిస్టిక్ స్టార్టప్ జీఎక్స్‌ప్రెస్ ప్రతి వారం 10 నుండి 15 కంటైనర్లలో అమెరికాకు ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు ధరలు పెరగడంతో ఒక్కో కంటైనర్‌కు 3600 డాలర్లు చెల్లిస్తోంది. కరోనాకు ముందు 1700 డాలర్ల నుండి 1800 డాలర్లు చెల్లించేవారు. ఈ కంపెనీ ఫౌండర్ ప్రవీణ్ వశిష్ట మాట్లాడుతూ గత నెల రోజుల కాలంలోనే షిప్పింగ్ ధరలు 40 శాతం పెరిగాయన్నారు. తాము అమెరికా, కెనడా, యూకేలకు సరుకులు ఎగుమతి చేస్తామని, ఈ 3 దేశాలకు షిప్‌మెంట్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ప్రవీణ్ అన్నారు. సరుకుల ఎగుమతిదారులకు ఇది ఇబ్బందికరంగా మారిందన్నారు.

రెండింతల సమయం
ముంబై నుండి న్యూయార్క్‌కు కంటైనర్ ద్వారా ఎగుమతులకు 28 రోజుల నుండి 30 రోజులు పడుతుందని, కొన్ని షిప్పింగ్ సంస్థలు కాస్త తక్కువగా తీసుకున్నప్పటికీ 60 రోజుల వరకు పడుతుందని ప్రవీణ్ అన్నారు. వివిధ అంశాలతో పాటు ప్రధానంగా దిగుమతులు భారీగా తగ్గిపోవడం వల్ల కంటైనర్ల కొరత ఏర్పడి, షిప్‌మెంట్ ధరలు పెరుగుతున్నాయన్నారు.

ఎగుమతులు అప్.. దిగుమతులు డౌన్
గతంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండేవి. కాబట్టి దేశంలో కంటైనర్ల సమస్య రాలేదని చెబుతున్నారు. కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలోకి దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో కంటైనర్ల సమస్య కనిపిస్తోంది. కరోనా లాక్ డౌన్ వల్ల సరఫరాలో అంతరాయాలు, డిమాండ్ వంటి కీలక అంశాలకు తోడు కొన్ని నెలలుగా దేశీయ వాణిజ్య విధానం గణనీయంగా మారుతోందని, దీంతో దిగుమతులు తగ్గి, కంటైనర్లు భారత్‌కు తక్కువగా వచ్చాయని చెబుతున్నారు.

ఆరు నెలల కాలంలో ఇలా..
భారత్ ఎగుమతులు సెప్టెంబర్ నాటికి కాస్త సానుకులంగా మారాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 5.99 శాతం వృద్ధిని సాధించి 27.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో దిగుమతులు 19.6 శాతం తగ్గి 30.31 బిలియన్ డాలర్లుగా ఉంది.
అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎగుమతులు 16.66 శాతం క్షీణించి 221.86 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతులు 35.43 శాతం పడిపోయి 204.12 బిలియన్ డాలర్లుగా ఉంది. ముఖ్యంగా చైనా నుండి వస్తువుల దిగుమతులు తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కంటైనర్ల సంక్షోభం ఎప్పుడు తొలగిపోతుందో తెలియని పరిస్థితి.


Click it and Unblock the Notifications