యస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ కూతురు రోషిణి కపూర్ విదేశీ ప్రయాణాన్ని ఈడీ అధికారులు అడ్డుకున్నారు. ఆమె లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆమెను ముంబై విమానాశ్రయంలో నిలిపివేశారు ఈడీ అధికారులు. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ద్వారా లండన్ వెళ్లేందుకు ఆమె ఆదివారం ముంబై విమానాశ్రయానికి వచ్చారు.
రాణా కపూర్‌పై నమోదైన PMLA కేసులో ఆమెను కూడా ప్రశ్నించాల్సి ఉంది. దీంతో ఆమె విదేశీ ప్రయాణాన్ని అనుమతించలేమని ఈడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. రాణా కపూర్‌ను మార్చి 11వ తేదీ వరకు ప్రత్యేక న్యాయస్థానం ఈడీ కస్టడీకి అప్పగించింది. అదే రోజు రోషిణి కపూర్ లండన్ వెళ్లేందుకు ప్రయత్నించారు.

కాగా, DHFL ప్రమోటర్లు వాద్వానీలు, రాణాకపూర్, ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అక్రమ నగదు ట్రాన్సాక్షన్ ఈడీ సోదాల్లో బయటపడినట్లుగా తెలుస్తోంది. రాణాకపూర్ కుమార్తెల నిర్వహణలోని 'డుఇట్ అర్బన్ వెంచర్స్' అనే డొల్ల కంపెనీ ఖాతాల్లోకి అక్రమంగా వచ్చిన రూ.600 కోట్ల ముడుపుల వివరాలు ఈడీ అధికారులు గుర్తించారు.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు
దీంతో సీబీఐ ఆయనపై FIR నమోదు చేసింది. రానాకపూర్ హయాంలో వాద్వానీల నిర్వహణలోని DHFL, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ అనే రెండు కంపెనీలకు యస్ బ్యాంక్ రూ.4,450 కోట్ల రుణాలిచ్చింది. ఈ రుణాన్ని చెల్లించడంలో ఈ రెండు కంపెనీలు విఫలమైనా, వాటి వసూలుకు యస్ బ్యాంకు చర్యలు తీసుకోలేదు. అందుకు ప్రతిగా DHFL ప్రమోటర్ల నుంచి ఈ రూ.600 కోట్లు కపూర్ కుటుంబ సభ్యులకు ముడుపుల రూపంలో అంది ఉంటాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications