దేశం, రాష్ట్రాలు కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేశాయని, కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నాయని, ఈ ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై పడుతుందని ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారికి వ్యాక్సీన్ వచ్చిన అనంతరం ఉద్దీపన చర్యలు ఉపసంహరించుకోవడం చాలా ముఖ్యమని కూడా పేర్కొంది. రాష్ట్రాల్లో స్థానికంగా విధించే లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆలస్యం కానుందని పేర్కొంది.

ఆర్థిక వ్యవస్థ సంకోచం.. కోలుకోవడానికి సమయం
కరోనా వైరస్ నుండి కోలుకున్నట్లు తేలితే ఉద్దీపనలు నిలుపుదల చేయాలని వెల్లడించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయినట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. మే, జూన్ నెలల్లో ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల కనిపించిందని నివేదిక వెల్లడించింది. జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ వృద్ధి తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో మరోసారి విధించిన లాక్ డౌన్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో సంకోచం కొనసాగుతుందని, కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని అంచనా వేసింది.

ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి
ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో క్వార్టర్‌లోను కొనసాగనుందని ఆర్బీఐ తెలిపింది. వినిమయరంగానికి తీవ్ర విఘాతం నెలకొందని, కరోనాకు ముందున్న పరిస్థితికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. కరోనాతో పోరాడేందుకు ప్రభుత్వవ్యయం వెచ్చిస్తున్నారని, డిమాండ్ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర రికవరీ కాలేదని తెలిపింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధనవ్యయం వెచ్చించే పరిస్థితి లేదని వెల్లడించింది.

పన్ను ఎగవేతదారుల్ని గుర్తించాలి
పన్ను ఎగవేతదారుల్ని గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, పన్ను ఎగవేతదారుల్ని గుర్తించేందుకు, ఇన్‌కం పారామీటర్స్‌కు అనుగుణంగా ఆదాయాన్ని ట్రాక్ చేయడం ద్వారా ట్యాక్స్ పేయర్స్‌ను పెంచేందుకు, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని ఆర్బీఐ సూచనలు చేసింది. ఇందుకు ప్రభుత్వం బిగ్ డేటా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని తెలిపింది. ఉపాది కల్పనపై దృష్టి సారించాలని, ఉత్పాదక శ్రమతో కూడిన సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలిపింది.


Click it and Unblock the Notifications