ఈ పరిస్థితుల్లో దయచూపండి, ఉద్యోగుల్ని తొలగించొద్దు: కంపెనీలకు మోడీ
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ నేడు (ఏప్రిల్ 14) ప్రకటించారు. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుండి కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కాస్త వెసులుబాటు కల్పించనున్నారు. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మాత్రం కఠిన లాక్ డౌన్ ఉంటుంది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగాలపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కరోనా-లాక్ డౌన్ కారణంగా కంపెనీలు, సంస్థల యాజమాన్యాలకు ప్రధాని మోడీ ఓ విజ్ఞప్తి చేశారు.

ఇబ్బందికర పరిస్థితుల్లో తొలగించొద్దు
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భారత్ విజయవంతమైందని, ఐతే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించవద్దని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. గత మూడు వారాలుగా లాక్ డౌన్‌ను కచ్చితంగా పాటిస్తూ ప్రజలు ఆదర్శంగా నిలిచారని, అందుకే మిగతా దేశాల కంటే భారత్ పరిస్థితి బాగుందని చెప్పారు. మీ ఉద్యోగుల పట్ల సానుభూతి చూపాలన్నారు.

కరోనా తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో
ఇప్పటికే ఉత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్ పడిపోయింది. దీంతో కంపెనీలు అనిశ్చితిలో ఉన్నాయి. కరోనా తర్వాత లేదా లాక్ డౌన్ తర్వాత కూడా డిమాండ్ ఎలా ఉంటుందనే ఆందోళన కంపెనీల్లో ఉంది. ఆయా రంగాల పరిశ్రమల పెద్దలు కేంద్రం నుండి భారీ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఇందుకు అనుగుణంగా మరో ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

కర్ణాటక ప్రభుత్వం కూడా..
ఉద్యోగులను తొలగించవద్దని కంపెనీలకు ప్రధాని మోడీ, కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని సంస్థలకు సూచిస్తున్నాయి. మంగళవారం కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని సూచించింది. అన్ని ఆర్థిక వ్యవస్థలు నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది.

విపత్కర పరిస్థితి
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోందని, ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి అన్ని వర్గాలు పరస్పరం సహకారంతో ముందుకు సాగాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ కూడా కంపెనీలకు సూచన చేసింది. ఉద్యోగులను తొలగించవద్దని, వేతనాలు తగ్గించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు సూచించింది.


Click it and Unblock the Notifications