కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లకు భారీగా గండిపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి క్వార్టర్‌లో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.1,37,825 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31 శాతం తగ్గాయి. జూన్ 15వ తేదీ నాటికి చెల్లించాల్సిన ముందస్తు చెల్లింపులు గత ఏడాదితో పోలిస్తే 76 శాతం మేర తగ్గడం ఇందుకు ముఖ్య కారణం. కరోనా కారణంగా కంపెనీలు, సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది. ఇటీవలే ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

అందుకే తగ్గాయి
కంపెనీలు చెల్లించే ముందస్తు పన్ను చెల్లింపులు ఏకంగా 76 శాతం పడిపోవడం గమనార్హం. కోరనా-లాక్ డౌన్ ఈ సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో దాదాపు 80 శాతం ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోవడం కూడా పన్ను వసూళ్లను దెబ్బతీసింది. ఏప్రిల్ - మే నెలలో దాదాపు 80 శాతానికి పైగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో పన్ను వసూళ్లపై ప్రభావం పడింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ క్వార్టర్‌లో జూన్ 15వ తేదీ నాటికి 31 శాతం క్షీణించి గత ఏడాది రూ.1,99,755 కోట్ల నుండి రూ.1,37,825 కోట్లకు పడిపోయాయి.

గత ఏడాదితో పోలిస్తే...
రీఫండ్స్ పోను మిగిలిన నికర పన్ను వసూళ్ల మొత్తం 32.3 శాతం క్షీణించి రూ.1,36,941 కోట్ల నుండి రూ.92,681 కోట్లకు తగ్గింది. రీఫండ్స్ పరిమాణం రూ.45,143 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్ 15 వరకు ఈ క్వార్టర్‌లో ముందస్తు పన్ను వసూళ్లు రూ.11,714 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.48,917 కోట్లుగా ఉంది. అంటే 76.5 శాతం తగ్గింది. ముందస్తు కార్పోరేట్ పన్ను వసూళ్లు రూ.39,405 కోట్ల నుండి 79 శాతం పడిపోయి రూ.8,286 కోట్లకు పరిమితమైంది. ఇందుకు సంబంధించి వ్యక్తిగత ఆధాయపు పన్ను వసూళ్లు 64 శాతం క్షీణించి రూ.9,512 కోట్ల నుండి రూ.3,428 కోట్లకు పడిపోయాయి

12 శాతం పెరుగుతాయనుకుంటే
2020-21 స్థూల పన్నుల వసూళ్లు 12 శాతం పెరిగి రూ.24.23 లక్షల కోట్లు నమోదు కావొచ్చునని బడ్జెట్‌లో అంచనా వేసింది ప్రభుత్వం. కార్పోరేట్ పన్నుల్లో కోత కారణంగా 2019-20లో పరోక్ష పన్నుల వసూళ్లు రూ.21.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల లక్ష్యాన్ని రూ.13.19 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2019-20లో వసూలైన రూ.10.28 లక్షల కోట్లతో చూస్తే 28 శాతం అధికం. వివాద్ సే విశ్వాస్ స్కీంకు స్పందన వస్తుందని భావించిన ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ కరోనా కారణంగా జూన్ క్వార్టర్‌లో ఇప్పటి వరకు ముందస్తు పన్ను చెల్లింపులు 76 శాతానికి పైగా క్షీణించాయి. కార్పోరేట్ కంపెనీల ముందస్తు చెల్లింపులు 79 శాతం క్షీణించాయి.


Click it and Unblock the Notifications