కరోనా సంక్షోభం వేళ మీ ఖాతాలు ఎంత సేఫ్ ? కోవిడ్ 19 మెసేజ్ కూ వాటికీ లింకేంటి ?
కరోనా సంక్షోభం పట్టి పీడిస్తున్న వేళ సాధారణ ప్రజలకూ తమ కష్టార్జితమైన ప్రతీ రూపాయీ విలువైనదే. గతంలో పరస్ధితి ఎలా ఉన్నా కరోనా వచ్చాక డబ్బు విలువ ప్రతీ ఒక్కరికీ తెలిసి వస్తోంది. ఇలాంటి సమయంలో మన బ్యాంకు ఖాతాలను కరోనా పేరుతో లూటీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారన్న వార్తలు ఖాతాదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ టెక్నిక్స్ తో ఖాతాలు లూటీ కావడం ఖాయమంటున్నారు నిపుణులు...

కరోనా వేళ మీ ఖాతాలు భద్రంగా ఉన్నట్లేనా ?
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయాలు తగ్గిపోవడం, జీతాలు, వేతనాల్లో కోతలు, కొత్త ఆదాయ మార్గాలు మూసుకుపోవడం వంటి కారణాలతో సగటు ఉద్యోగులు, వేతన దారులు, ఖాతాదారులకు దిక్కుతోచని పరిస్దితి. ఇదే అదనుగా వీరిపై సైబర్ దాడులు చేసేందుకు నేరగాళ్లు సిద్దమైపోతున్నారు. వీరు ఎంచుకున్న కొత్త మార్గాలు చూస్తే కస్టమర్లు షాక్ తినడం ఖాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా సంక్షోభాన్ని వాడుకుంటూ వీరు ఖాతాలు దోచేస్తున్న తీరు సగటు మనిషికి అంతుబట్టడం లేదు.

కోవిడ్ 19 మెసేజ్ వచ్చిందా ?
కరోనా పై ప్రజల్లో అవగాహన తెప్పించేందుకు వీలుగా ప్రభుత్వాలు దేశ ప్రజలందరికీ విచ్చలవిడిగా కోవిడ్ 19 మెసేజ్ లు పంపుతున్నాయి. వీటి ప్రామాణికత ఎంత అనేది కాసేపు పక్కనబెడితే ఇవి సైబర్ నేరగాళ్లకు మాత్రం ఎంతో ఉపయోగపడుతున్నాయి. మెసేజ్ రాగానే అందులో ఏముందని వెతుకున్నే సగటు భారతీయుల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటూ వారి ఖాతాలకు చిల్లు పెడుతున్నారు. కరోనాపై అవగాహన, అలర్ట్ పేరుతో వస్తున్న మెసేజ్ లను నిజంగా అవగాహన అనుకుంటూ ఓపెన్ చేయగానే నేరుగా బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతున్నాయి. వీటిని క్షణాల్లో ట్రేస్ చేసి అకౌంట్లను వారు ఖాళీ చేసేస్తున్నారు.

ఖాతాల్లో సొమ్ము దోచేస్తారిలా,,,
అచ్చుగుద్దినట్లుగా కోవిడ్ 19 పేరుతోనే మెసేజ్ లు పంపిస్తారు. సమగ్ర సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయాలని సూచిస్తారు. లింక్ ను టచ్ చేయగానే మన సెల్ ఫోన్ లోకి స్పైవేర్ వచ్చి చేరుతుంది. దాంతో వెంటనే ఫోన్ వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఫోన్ లోని బ్యాంకింగ్ యాప్ లు, బ్రౌజర్ ద్వారా ఖాతాల్లోకి లాగిన్ అయిపోయి క్షణాల్లోనే మన అకౌంట్లను కొల్లగొట్టేస్తారు. కళ్లు మూసి తెరిచేలోగా ఖాతా ఖాళీ అవుతుంది.

నిపుణుల హెచ్చరికలు..
కోవిడ్ 19 సమాచారం పేరుతో వచ్చే సందేశాలను ఒకటికి రెండుసార్లు చూసి నిర్ధారించుకున్న తర్వాత్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇన్ స్టాల్ చేయడానికి అనుమతించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఓసారి స్పైవేర్ ఇన్ స్టాల్ చేయడానికి అనుమతివ్వగానే మన సెల్ ఫోన్ లోని మెసేజ్ లతో పాటు సమగ్ర సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. అందుకే ఇలాంటి మేసేజ్ లు వచ్చినప్పుడు సాప్ట్‌వేర్ ఇన్ స్టాల్ చేయడానికి ఎట్టిపరిస్ధితుల్లోనూ అనుమతివ్వొద్దని వారు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications