కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. అన్ని దేశాలపై తీవ్రాతితీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా మన దేశంలోను నిరుద్యోగిత రేటు 27 శాతం వరకు పెరుగుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) వెల్లడించింది. మార్చి మధ్యలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు రెండు విడతల లాక్ డౌన్ ముగిసిన మే 3వ తేదీ నాటికి 27.11 శాతానికి చేరింది.

పట్టణాలలో ఎక్కువ.. గ్రామాల్లో తక్కువ
రెడ్ జోన్ ఉన్న పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత అధికంగా 29.22% ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇది 26.69% ఉంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి వలస పనివారు భారీ సంఖ్యలో సొంతూళ్లకు తరలిపోతుండటం తమ జాబ్ సెక్యూరిటీపై వారికి ఏర్పడిన అపనమ్మకానికి నిదర్శనమని ఈ నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ ఉపాధి అవకాశాలు అవ్యవస్థీకృత రంగంలోనే ఉన్నాయని, దీంతో నిరుద్యోగిత ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది.

అతి ఎక్కువ, అత్యల్ప నిరుద్యోగిత రాష్ట్రాలు
కరోనా కారణంగా మార్చి 29తో ముగిసిన వారం నుంచి దేశంలో నిరుద్యోగిత స్థిరంగా పెరుగుతూ వచ్చిందని CMIE నివేదిక తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8% నిరుద్యోగిత, తమిళనాడు (49.8%), జార్ఖండ్ (47.1%), బీహార్ ((46.6%), హర్యానా (43.2%) ఉన్నాయి. ఇవి టాప్ 5లో నిలిచాయి. మహారాష్ట్రలో 29.9 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 21.5 శాతం, కర్ణాటకలో 29.8 శాతం ఉన్నాయి. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్‌లో 2.2 శాతం, సిక్కిం 2.3 శాతం, ఉత్తరాఖండ్‌లో 6.5 అత్యల్ప నిరుద్యోగిత రేటు ఉంది.

అమెరికా నుండి భారత్ వరకు..
లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపులు నిలిచిపోవడం వల్ల ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులు ఉపాధి దొరకడం కష్టమనే ఆందోళనతో ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. కాగా, కరోనా కారణంగా అమెరికా వంటి అగ్రరాజ్యంలో నిరుద్యోగిత రేటు గణనీయంగా పెరిగింది. గత కొద్ది రోజుల్లోనే 2.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications