ఇక ప్రైవేటు చేతుల్లోకి అంతరిక్ష పరిశోధనలు, ప్రయాణాలు- ఇస్రోతో కలిసి..
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించే వరకూ ప్రభుత్వం చేతుల్లో ఉన్న అంతరిక్ష పరిశోధన రంగంలోకి ప్రైవేటు రంగానికీ భాగస్వామ్యం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ తర్వాత తీసుకొస్తున్న ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రకటించారు.

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యం..
దశాబ్దాలుగా దేశ అంతరిక్ష పరిశోధన రంగంలో ఎన్నో విజయాలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రోలో సమూల మార్పులకు కేంద్రం సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పటికే ప్రపంచంలో ఎంతో ముందున్న ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించడం ద్వారా మరిన్ని పరిశోధనలకు ఊతమిచ్చేలా కేంద్రం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇకపై ఇస్రోలో ప్రైవేటు సంస్ధలు భాగస్వామ్యులు కాబోతున్నాయి.

సాంకేతిక సహకారం కోసమే...
తాజా సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్రోకు భారీ ఎత్తున నిధులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ప్రైవేటు రంగంతో ఆ పని చేయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సరళీకృత జియో స్పేషియల్ డేటా విధానం ద్వారా టెక్ సంస్ధలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడం ద్వారా ఆర్ధికంగా లబ్ది పొందేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇస్రో పరిశోధనా ఫలితాలను వాడుకోవడం ద్వారా ప్రైవేటు సంస్దలు తాము లబ్ది పొందడంతో పాటు ఇస్రో బలోపేతానికి కూడా ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

అంతరిక్ష యానంలోనూ..
ఇస్రో సాగించే అంతరిక్ష ప్రయోగాలతో పాటు భవిష్యత్తులో సాకారం అవుతుందని భావిస్తున్న అంతరిక్ష యానంలోనూ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా చౌకగా అంతరిక్ష యానానికి అవకాశముండేలా కొత్త విధానానికి రూపకల్పన చేయబోతున్నారు. తద్వారా అంతరిక్షయానాన్ని సాధారణ ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేటు భాగస్వాములకు నమ్మకమైన పాలసీని తీసుకొస్తామని ఆర్దికమంత్రి నిర్మల ప్రకటించారు.


Click it and Unblock the Notifications