కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ షాక్, త్వరలో ఛార్జీలు పెంపు!
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలు వచ్చే నెల నుంచి టారిఫ్ ధరలు పెంచనున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. తాజాగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కూడా ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా ధరల పెంపుపై సమీక్ష జరపుతున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కాల్, డాటా ఛార్జీలు ఎంతమేరకు పెంచాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
టెలికం కష్టాలు: అప్పుల్లో కూరుకుపోయి...
సెప్టెంబర్ నెలకి BSNL నెట్ వర్క్ పరిధిలోకి 7.37 లక్షల మంది జత అయ్యారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 11.69 కోట్లకు చేరుకుంది. తమ వాయిస్ కాల్స్, డేటా టారిఫ్ పెంపుపై సమీక్షిస్తున్నామని, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి రావొచ్చునని చెప్పినట్లు ఇంగ్లీష్ పత్రికలు పేర్కొంటున్నాయి.

మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచుతున్నట్లు రెండు రోజుల క్రితం జియో తెలిపింది. అయితే తాము పెంచే టారిఫ్ ధరలు ఛార్జీల సవరణ, ఖాతాదారుల డేటా వినియోగాన్ని దెబ్బతీయని స్థాయిలో మాత్రమే ఉంటుందని జియో తెలిపింది. అలాగే, డిజిటల్ సేవల వృద్ధిని దెబ్బతీయకుండా, పెట్టుబడులపై సముచిత రాబడులు ఉండే స్థాయిలో ఛార్జీల పెంపు ఉంటుందని పేర్కొంది. దేశీయ టెలికం రంగాన్ని బలోపేతం చేసి కస్టమర్లకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్ పెంచుతున్నట్లు జియో తెలిపింది. దీంతో డేటా వినియోగం, డిజిటల్ అనుసరణలపై ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది.
అంతకుముందు సోమవారం ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పెంపును ప్రకటించాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, డిసెంబర్ ప్రారంభంలో పెంచనున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించాలంటే టారిఫ్ పెంచక తప్పదని ఎయిర్‌టెల్ పేర్కొంది. టెలి పరిశ్రమ ఎప్పటికప్పుడు మారుతోందని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని పేర్కొంది.


Click it and Unblock the Notifications