ఆన్‌లైన్ షాపింగ్ ఎఫెక్ట్, అమెజాన్‌లో కొత్తగా లక్ష ఉద్యోగాలు
న్యూయార్క్: అమెరికా, కెనడా వంటి దేశాల్లో తాము 1 లక్ష మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకుంటామని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని రంగాలు మినహా మిగతావి తీవ్రంగా నష్టపోయాయి. దీంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంతోమంది వేతనాల్లో కోత చోటు చేసుకుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ మాత్రం త్వరలో లక్ష ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఆన్‌లైన్ ఆర్డర్స్‌కు డిమాండ్ అందుకే
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్ ఆర్డర్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. ఈ వైరస్ సమయంలో అమెజాన్ షేర్లు భారీగా ఎగిసిన విషయం తెలిసిందే. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద కూడా ఈ ఆరు నెలల కాలంలో పెద్ద ఎత్తున పెరిగింది. ఆన్‌లైన్ ఆర్డర్స్‌కు డిమాండ్ పెరగడంతో ఆ మేరకు నియామకాలు ఉంటాయని అమెజాన్ తెలిపింది. ఆన్ లైన్ డిమాండ్ మేరకు మెజార్టీ నియామకాలను వినియోగించుకుంటామని, అలాగే పార్ట్ టైమ్, పుల్‌టైమ్ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.

కార్మికులు దొరకడం లేదు..
నిత్యావసరాలకు అధిక డిమాండ్ ఏర్పడటంతో 100 కొత్త వేర్‌హౌస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వేర్ హౌస్‌లలో ప్యాకింగ్ కోసం కొత్తగా నియమించుకునే వారిని ఉపయోగించుకుంటామని తెలిపింది. సంస్థకు సిబ్బంది కొరత ఉందని అమెజాన్ వేర్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్, డెట్రాయిట్‌వంటి నగరాల్లో కార్మికుల కొరత ఉందని, సైన్-ఆన్-బోనస్ 1000 వరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. గంటకు పదిహేను డాలర్ల వేతనం ఇస్తున్నామని, అయినప్పటికీ కార్మికులను కనుగొనడం కష్టంగా ఉందని చెప్పారు. నియామకాలలో ఆన్ లైన్ షాపింగ్‌కు అధిక సిబ్బందిని వినియోగించుకుంటామని చెబుతున్నారు.

ఏడాది కాలంగా ఉద్యోగాలు..
ఆర్డర్లకు డిమాండ్ పెరగడంతో కంపెనీ ఇప్పటికే గత ఏడాది ప్రారంభంలో 1,75,000 మంది ఉద్యోగులను నియమించుకుంది. గత వారం 33,000 కార్పోరేట్, టెక్ ఉద్యోగాల అవసరం ఉందని తెలిపింది. గత ఏడాది హాలీడేస్ సమయంలో 200,000 మంది ఉద్యోగులను తీసుకుంది.


Click it and Unblock the Notifications