కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితుల్లో మార్పులు తీసుకు వచ్చి.. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు భారీ ఉరట కలిగించనుందని మరోసారి వార్తలు వెలువడుతున్నాయి. సామాన్యులకు ఊరట కలిగించేందుకు ట్యాక్స్ స్లాబ్స్ తీసుకు వచ్చే అవకాశముందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం నియమించిన ఓ కమిటీ కూడా సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ రిలీఫ్‌పై వరుసగా వార్తలు వస్తున్నాయి. కమిటీ సూచించిన స్లాబ్ ప్రకారం రూ.10 లక్షల ఆదాయం వరకు ప్రజలకు ఊరట కలగనుంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహం
ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. వినిమయం పెంచేందుకు ఇప్పటికే కార్పోరేట్ ట్యాక్స్ సహా పలు కీలక ఉద్దీపన చర్యలు ప్రకటించింది కేంద్రం. ఇందులో భాగంగా ఇండివిడ్యుల్ ఆర్థికవృద్ధిని పెంచేందుకు పన్ను ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

పన్ను చెల్లింపు ఆదాయపరిమితి పెంచే ఛాన్స్
దేశంలో గణనీయంగా పడిపోయిన వినియోగ డిమాండ్ పెంచడం, తద్వారా ఆర్థికాభివృద్ధిరేటును పరుగులు తీయించడం లక్ష్యంగా కేంద్రం ఈ ఆలోచన చేస్తోందని ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయట. ఈ అంశాలు ప్రస్తుతం ప్రయివేటు చర్చల్లోనే ఉన్నాయని, ప్రధానంగా ప్రస్తుతం 30% పన్ను రేటు వర్తిస్తున్న రూ.10 లక్షల వార్షిక ఆదాయపు పన్ను స్లాబ్‌లో ఉన్నవారికి పన్ను చెల్లింపు ఆదాయ పరిమితి పెంచే అంశం పరిశీలిస్తోందన్నారు.

ఇంటి అద్దె, బ్యాంక్ డిపాజిట్స్‌పై వచ్చే వడ్డీపై ఊరట
ఇంటి అద్దె చెల్లింపులు, బ్యాంక్ డిపాజిట్స్ పైన ఆర్జించే వడ్డీ ఆదాయం వంటి వాటికి పన్ను బ్రేక్స్ రద్దు చేయవచ్చునని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రతిపాదించనున్న బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు ఉండవచ్చునని చెబుతున్నారు. అయితే ఆర్థిక శాఖ అధికారులు దీనిని ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఎంతోమందికి ఇది ఊరట కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవనం చేసే దిశగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలకు ఇది కూడా తోడవుతుందని అంటున్నారు.

వృద్ధి పుంజుకుంటుంది..
వ్యక్తిగత పన్ను మినహాయింపుపై ఇలాంటి ఊరట ఉంటే నెమ్మదించిన వృద్ధి రేటు త్వరలో పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఇటీవల కేంద్రం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడమే కాకుండా విదేశీ నిధులపై విధించే పన్నును కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సడలించింది. బ్యాంకులను విలీనం చేసింది. ఇలా ఎన్నో చర్యలు తీసుకుంటున్న కేంద్రం పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపులో బెనిఫిట్స్ ఇస్తే ఇది అందరికీ ఎంతో ప్రయోజనకరం. అయితే ఇది ఫైనలైజ్ కావాలి లేదా చర్చలు జరుగుతున్నట్లుగా అధికారులు ధృవీకరించాలి. ఇదే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం.

కార్పోరేట్ తగ్గింపు ప్రభావం..
కార్పోరేట్ పన్ను తగ్గింపును 22 శాతంగా చేయడంతో చాలా కంపెనీలు పన్నులు చెల్లిస్తాయి. ఈ తగ్గింపు నేపథ్యంలో అందరూ వ్యక్తిగత ఆదాయపు పన్ను అంశంపై కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.2.50 లక్షలపై 5 శాతంగా ఉంది. రూ.5 కోట్లకు పైగా సంపాదించే వారి ట్యాక్స్ రేటు దాదాపు 42.74 శాతంగా ఉంది. ఇది ఆసియా యావరేజ్ 29.99 శాతం కంటే చాలా ఎక్కువ.


Click it and Unblock the Notifications