దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదిస్తోంది. అనేక ప్రతికూల అంశాలు ఇందుకు కారణం అవుతున్నాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతూ ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు ఇంకా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఎక్కువ రాబడులను ఇచ్చే రంగాల్లోకి ఈ పెట్టుబడి దారులు తమ సొమ్మును తరలిస్తున్నారు.
దానివల్ల మంచి రాబడులను మూటగట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షితున్న రంగం బీమా రంగం. అందుకే స్టాక్ మార్కెట్లో నమోదు అయినా కంపెనీల్లో వీరి పెట్టుబడులు పెరుగుతున్నాయి. బీమా కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నిలకడగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలం వరకు బీమా కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ. 9,222 కోట్ల వరకు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి.

FPI
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఇన్సూరెన్సు ఈక్విటీల్లో రూ. 7,761 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జులైలో రూ.979 కోట్లు, అగస్ట్ ప్రథమార్ధంలో రూ. 482 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

పన్ను దెబ్బ
బడ్జెట్ లో భాగంగా పెట్టుబడి దారులపై సూపర్ రిచ్ పన్ను సర్చార్జీని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని మూలంగా పెట్టుబడి దారుల్లో ఆందోళన పెరిగింది. దీనికి నిదర్శనంగానే జులై, ఆగస్టులో విదేశీ పెట్టుబడిదారులు రూ. 30,000 కోట్ల పెట్టుబడులను భారత మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రతి నెలలోను బీమా రంగంలోకి మాత్రమే పెట్టుబడులు పెరిగినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
* నాలుగు నుంచి ఆరు త్రైమాసికాల్లో కేవలం విదేశీ పెట్టుబడిదారులే కాకుండా దేశీయ ఇనిస్టిట్యూషన్ల కూడా బీమా కంపెనీల షేర్లకు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. రాబడులు, మార్జిన్లు ఎక్కువగా ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లు బీమా రంగ కంపెనీలపై దృష్టి సారించడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ కారణం
* దీర్ఘకాలిక దృక్పథంతో ఇనిస్టిట్యూషనల్ బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
* మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనయినా బీమా కంపనీలు మాత్రం నిలకడ పనితీరును కనబరుస్తున్నాయి.
* బీమా కంపెనీల ప్రీమియంలో మెరుగైన వృద్ధి నమోదు అవుతోంది. యాన్యుటీ, సంరక్షణ వ్యాపారంలో మంచి వృద్ధి నమోదు అవుతోంది.
* బీమా తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ కంపెనీల వృద్ధికి ఢోకా లేకుండా పోతోంది. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.9,623 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
* కొత్త వాహన చట్టం అమలు నేపథ్యంలో వాహనాలకు బీమా తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో బీమా కంపెనీల రాబడులు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ కంపెనీల్లో పెట్టుబడులను పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. అయితే మీరు కూడా పెట్టుబడులతో సిద్ధం కండి మరి...


Click it and Unblock the Notifications