ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: సచివాలయ పోస్ట్‌లకు దరఖాస్తు గడువు పొడిగింపు
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడువును ఒకరోజు పెంచింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 10వ తేదీ (శనివారం) రాత్రి గం.11.59 నిమిషాలతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే గడువు పెంచాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఆదివారం (11వ తేదీ) రాత్రి గం.11.59 నిమిషాల వరకు పెంచారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఓ ప్రకటన చేశారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ ఉద్యోగం: ఖాళీలు, వేతనం, అర్హతలు, దరఖాస్తు విధానం

గడువు పెంపుకు కారణమిదే
ఏపీలో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులు నోటిఫికేషన్‍లో ఇచ్చిన సమయంలోగా దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో పొడిగించారు. వరద ప్రభావం కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువు పెంచాలని కోరారు.

లక్షలాది మంది దరఖాస్తు
శనివారం రాత్రి వరకు 21 లక్షల యాభై వేలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ 1కి 12 లక్షలకు పైగా, కేటగిరీ 2(ఏ)కి లక్షమందికి పైగా, కేటగిరీ 2(బీ)కి లక్షయాభై వేల మందికి పైగా కేటగిరి 3కి దాదాపు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఒక్కరోజే లక్షమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో అర్హులైన వారు తాము దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షలు రాసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులు నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పరీక్షలకు హాజరయ్యేలా వేర్వేరు తేదీల్ని నిర్ణయిస్తోంది. వేర్వేరు రోజులతో పాటు ఉదయం ఓ పరీక్ష, మధ్యాహ్నం ఓ పరీక్ష నిర్వహించనుంది. ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్నవారు ఒకే కేంద్రంలో పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంది.

పరీక్ష కేంద్రానికి ఇవి తీసుకురావొద్దు
పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధిస్తే రెండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరే అవకాశం ఏర్పడుతుంది.

మరో చిక్కు.. నిరుద్యోగ జేఏసీ డిమాండ్
గ్రామ, వార్డు సచివాలయపోస్టుల నియామక పరీక్షలను నెల రోజులు వాయిదా వేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఒకే వారంలో సచివాలయ పోస్టులకు, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగ నియామకాలు లేక వేలాదిమంది అభ్యర్థుల వయోపరిమిత మించిందని, కాబట్టి నోటిఫికేషన్‌లో వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసింది.


Click it and Unblock the Notifications