హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు అందరు రైతులకు అందలేదు. జూన్ ప్రారంభంలో ప్రభుత్వం రూ.6,900 కోట్లు విడుదల చేసింది. కానీ దాదాపు సగం మంది రైతులకు నగదు పంపిణీ కాలేదు. భూములు ఉన్న రైతులను 58 లక్షలుగా గుర్తించారు. ఇందులో ఇరవై లక్షల మందికి పైగా రైతుబంధ అందలేదు. టెక్నికల్ సమస్యల కారణంగా జమ చేయలేదని, వారం రోజుల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నిధుల లభ్యత లేకపోవడం వల్ల వేయలేదా లేదా టెక్నికల్ సమస్యల కారణంగా వేయలేదా అనే చర్చ సాగుతోంది.

53 లక్షలమంది అర్హులు
రైతుబంధు పథకం కింద అర్హులైన రైతులు మొత్తం 53 లక్షలుగా గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతా వివరాలను ఇప్పటికే ఖజానా కార్యాలయంలో సమర్పించింది వ్యవసాయ శాఖ. వీరికి మొత్తం రూ.6,480 కోట్లు జమ చేయాల్సి ఉంది. 33 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.3,430 కోట్లు జమ చేశారు. మరో 23 లక్షలమందికి పైగా జమ చేయాల్సి ఉంది.

పేర్లు తొలగించారా అని ఆందోళన
లక్షలాది మందికి పైగా రైతులకు రైతుబంధు సాయం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో కొంతమందికి రైతు బంధు రాకపోవడంతో తమ పేర్లు తొలగించారా అని ఆందోళన చెందుతున్నారు. మరో రూ.3వేల కోట్లకు పైగా జమ చేయాల్సి ఉంది. నిరుడితో పోలిస్తే రైతు బంధు అర్హుల సంఖ్య ఈసారి పెరిగింది.

నిధుల సమీకరణ
రైతుబంధుకు అవసరమైన నిధులు సమీకరించేందుకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సెప్టెంబర్ లోపు వరుసగా మూడు నెలల్లోనే.. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తమకు రూ.7500 కోట్లు అప్పు కావాలని ఇటీవలే ఆర్బీఐకి ఇండెంట్ ఇచ్చింది. ఆర్బీఐ నుంచి నిధులు రాగానే రైతుల అకౌంట్లలో నిధులు వేస్తారని చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో మొత్తం 12 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదు.


Click it and Unblock the Notifications