అప్లికేషన్ అవసరం లేదు... అధికారులే స్వయంగా మీకు పాన్‌కార్డ్ ఇస్తారు!
న్యూఢిల్లీ: పాన్ కార్డు లేనివారు ఆధార్ కార్డుతో కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. పాన్ స్థానంలో ఆధార్‌ను ఉపయోగించవచ్చునని స్పష్టం చేసింది. ఈ రెండు కార్డుల్లో దేనినైనా ఉపయోగించవచ్చునని తెలిపాయి. ఇప్పుడు CBDT కూడా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకున్నప్పటికీ రానుంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సుమోటో ప్రాతిపదికన పాన్ కార్డు జారీ చేసే యోచనలో ఉంది.

సుమోటోగా పాన్ జారీ చేసే ఛాన్స్
ఈ మేరకు CBDT చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ తెలిపారు. ఆదార్‌తో ఐటి రిటర్న్స్ దాఖలు చేసిన వారికి సుమోటోగా పాన్ జారీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన అర్థం పాన్ పూర్తిగా నిరుపయోగం అవుతుందని కాదని, పాన్ లేకుండా కేవలం ఆధార్ మాత్రమే ఉన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇది అదనపు సదుపాయం మాత్రమేనని భావించాలని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో అసెసింగ్ అధికారి తనంత తానుగా పాన్ జారీ చేయవచ్చునని చెప్పారు.

పాన్ జారీ చేసే అధికారం
పాన్ లేని వారు ఆధార్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని బడ్జెట్‌లో చెప్పిన నేపథ్యంలో పాన్ నెంబర్ అవసరమైన చోట ఆధార్ ఇస్తే సరిపోతుంది కదా అని భావిస్తున్నారు. ఈ అంశంపై కూడా స్పందించారు. 'పాన్ కార్డ్ లేకుండా కేవలం ఆధార్ కార్డుతో రిటర్నులు దాఖలు చేసే వారికి నేరుగా కొత్త పాన్ కార్డును అందించాలని భావిస్తున్నాం. ఈ మేరకు అధికారి.. ట్యాక్స్ చెల్లించే వారికి స్వయంగా పాన్ జారీ చేసే అధికారాన్ని చట్టం ఇస్తోంది' అని పేర్కొన్నారు.

ఆధార్ - పాన్ లింక్ అవసరమే
పాన్ కార్డు మరుగునపడినట్లుగా అర్థం చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. పాన్ మనుగడలోనే ఉంటుందని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పాన్ లేకుంటే ఇబ్బందులు తలెత్తకుండా మాత్రమే ఈ సౌకర్యమని తెలిపారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానం ఇప్పుడు తప్పనిసరి అన్నారు. ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే అధికారులు పాన్ ఇస్తారని, అప్పుడు అదే లింక్ అవుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications