అనిల్ అంబానీ రిలయన్స్ సెంటర్ లీజుకే! ఆఫీస్ ప్రత్యేకతలు ఇవీ...
ముంబై: అనిల్ అంబానీ తన గ్రూప్ ఆఫ్ కంపెనీల రుణ భారాన్ని తగ్గించుకునేందుకు పలు షేర్లు, ఆస్తులను విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబైలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శాంతాక్రజ్ ఈస్ట్‌లోని ఈ భవనాన్ని దీర్ఘకాలికంగా లీజుకు ఇచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు తెలిపింది.

రుణభారం ఇలా తగ్గించుకుంటున్నారు..
దీంతో వచ్చే నగదును రుణాలు తీర్చేందుకు వినియోగిస్తామని పేర్కొంది. గత ఏడాది అదానీ ట్రాన్స్‌మిషన్‌కు తమ ముంబై ఇంధన వ్యాపారాన్ని రూ.18,800 కోట్లకు విక్రయించింది. దీంతో సంస్థ రుణ భారం రూ.22,000 కోట్ల నుంచి దిగి వచ్చింది. అలాగే క్యూబ్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్డును అమ్మేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్‌కల్లా ఈ డీల్ ముగిస్తే, రూ.3,600 కోట్లు వస్తాయని అంచనా. అయితే ఈ భవనాన్ని లీజుకు లేదా విక్రయించడానికి చూస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. లీజుకే ఇవ్వాలనుకుంటున్నట్లుగా అనిల్ గ్రూప్ ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోగా రుణవిముక్తం కావాలని రిలయన్స్ ఇన్‌ఫ్రా భావిస్తోంది. ప్రస్తుతం రూ.6వేల కోట్ల రుణభారం ఉంది.

రిలయన్స్ సెంటర్ కార్యాలయం ప్రత్యేకతలు
15,514 చ.మీ. ప్లాట్‌లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయం ఉంది. 425కు పైగా కార్లను పార్కింగ్ చేసే వెసులుబాటు ఉంది. ముంబై వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే పక్కనే ఉంది. స్థానిక ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌కు కేవలం పదిహేను నిమిషాల్లో వెళ్లవచ్చు. దేశీయ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను పది నిమిషాల్లో చేరుకోవచ్చు. బాంద్రా-కుర్లా-కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ సెంటర్‌కు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు. త్వరలో వచ్చే శాంతాక్రజ్ మెట్రో స్టేషన్‌కు అయితే నడిచి వెళ్లొచ్చు. ఈ ఆఫీసును అద్దెకు ఇస్తే ఇందులో పనిచేసే ఉద్యోగుల్ని దక్షిణ ముంబైలోని బెల్లార్డ్ ఎస్టేట్‌కు ఆఫీస్ మారుస్తారు. ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రిలయన్స్ గ్రూప్ ఆఫీస్‌లకు ఉద్యోగుల్ని తరలిస్తారు.

రిలయన్స్ ఇన్‌ఫ్రా
రిలయన్స్ సెంటర్ లీజుతో రూ.3,000 కోట్లు వస్తాయని కంపెనీ అంచనా వేస్తున్నప్పటికీ రూ.2 వేల కోట్ల వరకు మాత్రమే సమకూరే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ప్రోపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్‌ను సలహాదారుగా నియమించుకొంది. బ్లాక్‌స్టోన్‌తో పాటు అమెరికాకు చెందిన మరో ప్రయివేటు ఈక్విటీ (PE) పెట్టుబడుల సంస్థతో చర్చలు జరుపుతోంది. రిలయన్స్ సెంటర్ లీజు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్ 4.4 శాతం క్షీణించింది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్
కాగా, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్.కామ్) కూడా దివాలా బాటలో ఉంది. దివాలా ప్రక్రియ ఎన్సీఎల్టీలో ఉంది. ఇప్పటికే రూ.57,500 కోట్ల క్లెయిమ్స్ వచ్చాయి. ఇందులో సొంత గ్రూప్ సంస్థలు కూడా తమకు రూ.7,000 కోట్లు ఆర్.కామ్. నుంచి రావాలని క్లెయిమ్ చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications