2019-20 ఆర్థిక సంవత్సరంలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ట్రావెల్, ఆతిథ్య, బీపీవో రంగాల్లో రానున్న ఆరు నెలల్లో 11.5 లక్షల ఉద్యోగాలు కొత్తగా రానున్నాయని టీమ్ లీజ్ సర్వేలో తేలింది. నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందని అందరిలోను ఆందోళన ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో టాప్ 5 సాఫ్టువేర్ దిగ్గజాలు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. తాజాగా, టీమ్ లీజ్ లక్షలాది ఉద్యోగాలు రానున్నాయని తెలిపింది. ఈ రిపోర్ట్స్‌ను బట్టి ఇటీవల క్రమంగా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 19 రంగాల్లోని 775 కంపెనీల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు.

అందుకే ఉద్యోగాల కల్పన పెరగనుంది
స్టాక్ మార్కెట్ల ర్యాలీ, పెట్టుబడులు ఊపందుకోవడం వంటి సానుకూల అంశాలు ఉద్యోగాలు పెరగడానికి ప్రధాన కారణమని టీమ్ లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రీతుపర్ణ చక్రవర్తి అన్నారు. గత సంవత్సరం చవరి ఆరు నెలల్లో ఉద్యోగ కల్పన రెండు శాతం తగ్గిందని, ఈసారి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నాటికి మూడు శాతం పెరగనుందన్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో 11.5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఔట్‌లుక్ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో తెలిపారు. రిటైల్, లాజిస్టిక్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, డ్యూరబుల్ రంగంలో వరుసగా 1.66 లక్షలు, 1.49 లక్షలు, 1.17లక్షలు, 1.10 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు.

11 రంగాల్లో జోరు
దేశవ్యాప్తంగా 19 రంగాలు, 14 జియోగ్రాఫిక్స్, 775 మంది బిజినెస్‌మెన్, 85 ఉద్యోగ సంఘాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందించారు. 19 రంగాల్లో 11 ఉద్యోగ కల్పన జోరు మీదుగా ఉండగా, మరో ఎనిమిది రంగాల్లో మాత్రం నిరాశాజనకంగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో అవకాశాలు ఆశావాదంగా ఉండనున్నాయి. తృతీయ, గ్రామీణ ప్రాంతాల్లో రెండు శాతం పెరుగుదల ఉండనుంది. ఇండస్ట్రీస్ 57శాతం ఎంప్లాయిమెంట్‌ను కల్పించనుంది. ట్రావెల్, హాస్పిటాలిటీ, బీపీవో/ఐటీఈఎస్‌లు 4 శాతం ఉద్యోగాలు కల్పించనున్నాయి. పెట్టుబడులు పెరగడం, సవరించిన ఎఫ్‌డీఐ నిబంధనలు, ఈ ప్రభుత్వం పాలసీలు ఉద్యోగాలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. పవర్, ఎనర్జీ, లాజిస్టిక్ సెక్టార్‌లో మూడు శాతం పెరగనున్నాయి.

హైదరాబాదులో తగ్గనున్న ఉద్యోగ కల్పన వృద్ధి
మధ్యస్థాయి ఉద్యోగుల్లో పెరుగుదల నాలుగు శాతం ఉండగా, కిందిస్థాయి ఉద్యోగుల్లో 3 శాతం అధికం. మీడియం సైజ్ బిజినెస్ సిబ్బంది ఉపాధిలో 5 శాతం పెరగగా, లార్జ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్‌లో 2 శాతం పెరగనుంది. టాప్ 14 నగరాల్లో సగం ప్రతికూల సెంటిమెంట్ ఉంది. పుణేలో 5 శాతం, కోయంబత్తూరులో 4 శాతం, ఇండోర్‌లో 4 ఉద్యోగ కల్పన పెరగనుండగా, కొచ్చిలో 4 శాతం, గుర్గావ్‌లో 4 శాతంతోపాటు హైదరాబాదులోను తగ్గనుందట. గత ఆరు నెలల్లో 19 రంగాల్లో ఐదింట వలసలు తగ్గుముఖం పట్టాయి. నిర్మాణ, రియల్ ఎస్టేట్, ఐటీ, కేపీవో, టెలి కమ్యూనికేషన్స్, ట్రావెల్, ఆతిథ్య రంగాలు ఉన్నాయి. వ్యవసాయ, ఆగ్రో కెమికల్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో పెరిగింది.


Click it and Unblock the Notifications