NYAY స్కీంతో ఇండియా వృద్ధికి బూస్ట్: ఎలాగో చెప్పిన మన్మోహన్, మిడిల్ క్లాస్‌పై భారమా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 'న్యాయ్' స్కీంను తీసుకు వస్తుందని, ఇది ఆర్థిక వృద్దికి ఉపయోగపడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నిరుపేదలకు కనీస ఆదాయం పథకమే న్యాయ్ స్కీం. పేదల ఉన్నతికి వ్యతిరేకంగా ఉన్నవారే న్యాయ్ స్కీంను వ్యతిరేకిస్తారన్నారు. దేశంలో 20 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారికి జీడీపీలో 1.5 శాతం కేటాయించడం సరైనదే అన్నారు. న్యాయ్ స్కీం వల్ల మధ్యతరగతిపై ట్యాక్స్ పడుతుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ఈ స్కీంను అమలు చేయడానికి మధ్యతరగతిపై ఎలాంటి భారం మోపబోమని చెప్పారు.

సంపద విస్తరణకు కట్టుబడి ఉన్నాం
సంపద సృష్టి, సంక్షేమ విస్తరణకు తాము కట్టుబడి ఉన్నామని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఆర్థిక రంగం విస్తరిస్తున్నకొద్దీ దాని ఫలాలు పేదలకు అందేలా చూడాలన్నారు. జీడీపీ ఇప్పుడున్న రూ.210 లక్షల కోట్ల నుంచి అయిదేళ్లలో రూ.400 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఐదు కోట్ల పేద కుటుంబాలకు న్యాయ్ కింద సాయం అందించడానికి రూ.3.6 లక్షల కోట్లు చాలునని చెప్పారు. ఉపాధి హామీ పథకం మాదిరిగానే న్యాయ్ స్కీంను కూడా విజయవంతంగా అమలు చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక సమతుల్యత కొనసాగించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

నోట్ల రద్దుపై మన్మోహన్
నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని మన్మోహన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థపై పూర్తి అవగాహన లేకపోవడం వల్లే నోట్ల రద్దు అన్నారు. దీంతో చిరు వ్యాపారులు ఆదాయాన్ని, మధ్య తరగతివారు తమ కష్టార్జితాన్ని కోల్పోయారని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి సరైన ఎకనామిక్ విజన్ లేదన్నారు. ప్రభుత్వం సరైన సంస్కరణలు చేపడితే వృద్ధి మరింత వేగవంతంగా ఉండేదని చెప్పారు. ప్రభుత్వానికి మంచి మెజార్టీ వచ్చిందని, దీంతో మంచి నిర్ణయాలు తీసుకొని, పేదరికాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మేం ఏం చేస్తామంటే
2014 నాటికి రూ.2.51 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు 2018 డిసెంబర్ నాటికి రూ.10.36 లక్షల కోట్లకు ఎగబాకాయని చెప్పారు. మరో రూ.5.5 లక్షల కోట్ల మొండి బకాయిల్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది బ్యాంకుల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దీనిని సమీక్షించి, బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లను మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. బ్యాంకులు, సెక్యూరిటీలు, ఆర్థిక మార్కెట్లలో కఠిన చర్యలను కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో వివరించిందన్నారు.


Click it and Unblock the Notifications