కాంగ్రెస్ ఆదాయ పథకంపై రఘురాం రాజన్ ఏమన్నారంటే? ఆరెస్సెస్‌పై తీవ్రవ్యాఖ్యలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మినిమం ఇన్‍కం గ్యారెంటీ, ఉద్యోగాలు తదితర అంశాలపై మరో ఇంటర్వ్యూలోను స్పందించారు. ఆయన రచించిన 'ది థర్డ్ పిల్లర్' పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

రఘురాం రాజన్ విమర్శలు
దశాబ్దాలుగా భారత్‌లోని స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తున్నామని రఘురాం రాజన్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ఆశించిన ఫలం రాలేదని, మున్సిపాలిటీలు కూడా సాధికారత సాధించలేకపోయాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పైన కూడా విమర్శలు గుప్పించారు. ఉదారవాద, సహనశీల, వినూత్నమైన భారతానికి ఇది తీవ్రమైన ముప్పు అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, స్వాగతించాలన్నారు. ఒకరి అభిప్రాయంపై మరొకరికి అసహనం ఉంటేనే అసలు సమస్య అని రఘురాం రాజన్ అన్నారు.

ఆర్బీఐ, కేంద్రం మధ్య సంబంధాలపై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాల గురించి కూడా రఘురాం రాజన్ మాట్లాడారు. ఈ రెండు కూడా విరుద్ధంగా ఉంటాయని, కానీ ఆ వైరుద్యం నిర్మాణాత్మకంగా ఉండాలని, అంతేకానీ విధ్వంసకరంగా ఉండవద్దని చెప్పారు. లోకల్ కమ్యూనిటీస్‌ను ప్రభుత్వం పటిష్టం చేయాలని, స్టేట్, మార్కెట్స్ తర్వాత ఇదే ఆర్థిక వ్యవస్థకు థర్డ్ పిల్లర్ వంటిదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కనీస ఆదాయ పథకంపై
ఇటీవల రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం (మినిమమ్ ఇన్‌కం గ్యారెంటీ) పైన కూడా రఘురాం రాజన్ స్పందించారు. ఆయన తన పుస్తకంలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పథకంపై ప్రశ్నించగా, రాజన్ స్పందిస్తూ... సమర్థవంత లక్ష్యంతో ఈ పథకం ప్రారంభిస్తే అది నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర పథకాలపై ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications