రియల్ ఎస్టేట్ ధరలు దిగిరావొచ్చు, బంగారానికి డిమాండ్ పెరగొచ్చు
నవంబరు 8న ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. నల్లధనం కలిగిన వారికి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేదువార్తే. డిసెంబరు 30 తర్వాత నల్లధనం రూపంలో పెద్ద నోట్లన్నీ వృ
అవినీతి, నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క చర్యను తీసుకుంటోంది. నల్లధనం దాచుకునేందుకు స్వర్గధామాలైన పలు దేశాలతో సమాచారాన్ని పంచుకునేందుకు ఒప్పందాలను చేసుకున్నారు. అదే కోవలో నవంబరు 8న ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. నల్లధనం కలిగిన వారికి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేదువార్తే. డిసెంబరు 30 తర్వాత నల్లధనం రూపంలో పెద్ద నోట్లన్నీ వృథా అవుతాయి. అంటే విలువను కోల్పోతాయి. అదే విధంగా నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట పడుతుంది. వచ్చే యూపీ, పంజాబ్ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపగలదు.
2016 మార్చి నెలాఖరు నాటికి ఆర్థిక వ్యవస్థలో రూ. 16.5 లక్షల కోట్ల విలువ చేసే కరెన్సీ చలామణీలో ఉన్నట్లు అంచనా. ఇందులో 82 నుంచి 86 శాతం డబ్బు పెద్ద నోట్ల రూపంలో ఉంది. మళ్లీ ఆయా నోట్లలో ఎక్కువ శాతం నల్లధనం రూపంలో అక్రమార్కుల, పన్ను ఎగవేతదార్ల వద్ద మూలుగుతోంది. అయితే సక్రమ మార్గాల్లో డబ్బు ఉన్నవారు ఆయా నోట్లను డిసెంబరు 30 వరకూ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. తుది గడువు తర్వాత అక్రమార్జన(నల్లధనం) కలిగిన వారికి ఇబ్బందులు తప్పవు.
అయితే నల్లధనం కలిగిన వారికి దాచుకునేందుకు కనిపించే మొదటి సులువైన మార్గం బంగారం. దీంతో బంగారు, వెండి, వజ్రాభరణాలు, ఇతర ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. కేవలం డిసెంబరు ఆఖరు వరకే గాక తర్వాత కూడా కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ కొనసాగవచ్చు.
ఇప్పటికే తగ్గుముఖం పడుతున్న స్థిరాస్తి ధరలు మరింత తగ్గొచ్చు. నల్లధనం చలామణీకి అవకాశాలు తక్కువ అవ్వడం మూలంగా రియల్ ఎస్టేట్ తాత్కాలిక నగదు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ తగ్గడం మూలంగా ధరలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయని అంతర్గతంగా ప్రభుత్వ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. సాధారణంగా నల్లధనం, బినామీ లావాదేవీల రూపంలోనే ఎక్కువగా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.
రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల వాటా 86 శాతంగా ఉంది. ఇందులో రూ. 500 నోట్లు 45%, రూ. 1000 నోట్లు 39 శాతం ఉండొచ్చని లెక్కలు చెపుతున్నాయి. ఈ విధంగా చూస్తే రూ. 1000 నోట్ల విలువ 6 బిలియన్లగానూ, రూ. 500 నోట్ల విలువ 16 బిలియన్లుగానూ ఉంటుంది. ఇవన్నీ సగటు అంచనాలు. పెద్ద నోట్లకు నకిలీలు చేయడం ఫోర్జరీ చేసే వాళ్లకు కాస్త సులువైన వ్యవహరంగానే ఉండటంతో పాక్ నుంచి పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ వచ్చి దేశమంతా విస్తరించింది. పెద్ద నోట్ల రద్దుతో ఈ బాధ తప్పుతుంది. పాత రూ. 500, రూ. 1000 నోట్ల స్థానంలో కొత్త నోట్లను ముద్రించేందుకు ఆర్‌బీఐకి రూ. 10 వేల కోట్ల ఖర్చవుతుందని అనధికార అంచనా. అయినప్పటికీ దేశ మొత్తం మీద నిర్మూలించగలిగే బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీతో పోలిస్తే ఇది ఎంతో తక్కువనే చెప్పాలి. నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉన్న జీడీపీకి రెండు మూడింతలు ఉంటుందని పలు ఆర్థిక సంస్థల అధ్యయనాలు చాటి చెబుతున్నాయి. అమెరికాలో సైతం 100 డాలర్ల కరెన్సీని రద్దు చేయాలని చాలా రోజుల నుంచి డిమాండ్ ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications

