IT return: అలా ఐనా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే.. ఇవి తెలుసుకోండి
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే గడువును పొడిగించినప్పటికీ అప్పటి వరకు వేచి చూడకుండా వెంటనే రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిది. చాలా పన్ను మినహాయింపులు ఉన్నందున జీతాలు, బ్యాంక్ డిపాజిట్స్ పైన వడ్డీ వంటి ఆదాయం కలిగిన వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడతారు. పన్ను చెల్లింపు, ఐటీఆర్ ఫైలింగ్ ఈ రెండు కూడా ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండే రెండు ప్రత్యేక, విభిన్నమైన చట్టపరమైన బాధ్యతలు. పన్ను చెల్లింపు మినహాయింపు ఉందని భావించి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉండటం కుదరదు. ఐటీఆర్ పైలింగ్ తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించినందున, ఆలస్యం చేయకూడదు. ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆదాయ, ఆదాయేతర ప్రమాణాలు తప్పనిసరి. వీటిని చూడండి...

వయస్సును బట్టి మినహాయింపు
ఒక వ్యక్తి తన మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించిన సందర్భంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. వయస్సు ఆధారంగా వివిధ ప్రాథమిక మినహాయింపు పరిమితులు వర్తిస్తాయి. అరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారందరూ వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.2.50 లక్షలకు మించి ఉంటే పన్ను చెల్లించాలి. అరవై ఏళ్లు పైబడిన వారు, 80 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి రూ.3 లక్షల వరకు మినహాయింపు ఉంది. ఎనభై ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.

పరిమితి దాటితే...
పైన పేర్కొన్న పరిమితులు దాటినప్పటికీ ఆదాయ పన్ను చట్టంలోని చాపర్ట్ VIAలోని సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, 80జీ, 80టీటీఏ, 80టీటీబీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి. అలాగే, సెక్షన్ 54, 54ఎఫ్, 54ఈసీ కింద క్లెయిమ్ చేసుకున్న మినహాయింపు రెసిడెన్షియల్ హౌస్‌లో రీఇన్వెస్ట్‌మెంట్ కోసం ఉపయోగించినప్పుడు లేదా క్యాపిటల్ గెయిన్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ ఐటీఆర్ ఫైలింగ్ కోసం పరిమితిని నిర్ణయించడానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి జోడించాలి.
వివిధ మినహాయింపుల కారణంగా మీ ఆదాయం రూ.2.50 లక్షల కంటే దిగువకు రావొచ్చు. అప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు. కానీ ఐటీ రిటర్న్స్ మాత్రం దాఖలు చేయాలి. 87ఏ కింద రిబేట్ తర్వాత మీ నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలు దాటకపోతే కూడా పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కానీ ఐటీఆర్ దాఖలు చేయవలసి రావొచ్చు.

ఆదాయేతర ప్రమాణాలు
ఆదాయ ప్రమాణాలతో పాటు అవసరం లేకపోయినా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన రెండు ఆదాయేతర ప్రమాణాలు ఉన్నాయి. పన్ను చట్టం కింద నివసించే వ్యక్తులకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయి. పన్ను ప్రయోజనం కోసం ఉంటే కనుక, మీకు భారత దేశం వెలుపల ఉన్న ఆస్తిపై ప్రయోజనం లేదా ఆదాయం ఉంటే ఆదాయం ఎంత వస్తుందనే అంశంతో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఇది విదేశీ కంపెనీ షేర్స్, బాండ్స్, ESOPల వంటి వాటిలోను ఉండవచ్చు. ఆదాయం ప్రకారం మాత్రమే చూస్తే ఫైల్ చేయవలసిన అవసరం లేనప్పటికీ, భారతదేశం వెలుపల సున్నా బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నప్పటికీ ఐటీఆర్ దాఖలు చేయాలి. మీరు విదేశాల్లోని మీ ఖాతాను క్లోజ్ చేయకుండానే తిరిగి వచ్చిన సందరభంలో, మీ కంపెనీ లేదా కంపెనీ సబ్సిడరీ EOPs అలాటే చేస్తే దీనిని ఫైల్ చేయాలి. విదేశాల నుండి తిరిగి వచ్చిన ఎన్నారైలకు ఇది భారమే.
మరో సందర్భంలో అంటే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో ఏడాదిలో రూ.1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీఆర్ దాఖలు చేయాలి. నగదు రూపంలోనే కాకుండా ఏ విధంగా అయినా కరెంట్ ఖాతాలో జమ చేసిన మొత్తం రూ.1 కోటి కంటే ఎక్కువ ఉంటే ఇది వర్తిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం రూ.2 లక్షలు చెల్లిస్తే ఐటీఆర్ దాఖలు చేయాలి. విద్యుత్ బిల్లు రూ.1 లక్ష దాటినా ఐటీఆర్ ఫైల్ చేయాలి.


Click it and Unblock the Notifications