ఇన్‌కం ట్యాక్స్ కొత్త రూల్స్: టీడీఎస్ దరఖాస్తుల్లో సవరణలు, ఎందుకో చెప్పాలి
ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ ఫామ్‌ను సవరించింది. దరఖాస్తులు మరింత సమగ్రంగా ఉండేలా, పన్నును తగ్గించకుండా లేదా అసలు పన్ను కోత విధించకుండా ఉండేందుకు కారణాలు చూపేలా తప్పనిసరి చేస్తూ దరఖాస్తులను రూపొందించింది. సవరించిన టీడీఎస్ ఫామ్ ప్రకారం బ్యాంకులు కూడా రూ.1 కోటికి పైన ఉపసంహరణలపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహయింపు) పొందుపరచాల్సి ఉంటుంది.

వీటిపై టీడీఎస్
ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) సవరించిన ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ-కామర్స్ ఆపరేటర్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు బిజినెస్ ట్రస్ట్స్ జారీ చేసే డివిడెండ్, క్యాష్ విత్‌డ్రాలు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీలు వంటి వాటిపై కూడా టీడీఎస్ విధిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

వీటి సవరణ
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఫామ్ 26Q, ఫామ్ 27Qల ఫార్మాట్‌ను సవరించినట్లయిందని నంగియా అండ్కో ఎల్ఎల్‌పీ పార్ట్‌నర్ శైలేష్ కుమార్ అన్నారు. భారతీయ, ప్రవాస భారతీయులకు చేసే చెల్లింపులపై కోత వేసిన, జమ చేసిన మొత్తం వివరాలను కూడా నింపాల్సి ఉంటుందన్నారు. భారతీయ వ్యక్తులకు చెల్లించే శాలరీ కాకుండా మిగతా వాటిపై క్వార్టర్ టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఫామ్ 26Q వినియోగిస్తారు. ఎన్నారైలకు, విదేశీయులకు వేతనాలు కాకుండా చెల్లించే మొత్తాలపై టీడీఎస్ రిటర్న్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌కు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం కాకుండా మిగతా కోత విధించే సంస్థలు అన్నీ తమ పాన్ నెంబర్‌ను దరఖాస్తులో పొందుపరచాలి.

ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలి
26క్యూ ఫామ్‌లో ఇండియాలోని ప్రభుత్వ, కార్పోరేట్ ఉద్యోగికి జీతం కాకుండా చేసిన చెల్లింపులను ఇందులో నమోదు చేసి ప్రతి 3 నెలలకు ఓసారి సమర్పించాలి. ఫామ్ 27క్యూలో ఎన్నారైలు, విదేశీయులకు చేసిన చెల్లింపులు చెప్పాలి. ఐటీ డిపార్టుమెంట్ టీడీఎస్ ఫామ్‌లో మార్పులు చేసి, మరింత సమగ్రంగా మార్చడంతో పన్ను టీడీఎస్‌ను ఎందుకు చెల్లించడం లేదో ఇందులో వెల్లడించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications