రూ.45,000 కోట్లు అదనం, మోడీ ప్రభుత్వానికి 'కార్పోరేట్' శుభవార్త!
ఆర్థిక మందగమనం వల్ల గత కొంతకాలంగా ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. జీఎస్టీ కలెక్షన్లు తగ్గిపోయాయి. కార్పోరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గించడంతో ప్రభుత్వంపై రూ.1.45 లక్షల కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రభుత్వానికి రెవెన్యూ భారీగా తగ్గింది. ఇలాంటి సమయంలో కాస్త ఊరట కలిగించే శుభవార్త! ప్రభుత్వ ఆదాయంలో రూ.45వేల కోట్ల మేరకు పెరగనుందట..

రూ.1 లక్ష కోట్లు తగ్గుదల
గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించిన అనంతరం ఈ సంబంధిత పన్ను రూ.1.45 లక్షల కోట్ల మేరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేశారు. కానీ తాజా లెక్కల అంచనా ప్రకారం ఈ తగ్గుదల రూ.1 లక్ష కోట్లు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అంటే రూ.45 వేల కోట్లు అనుకోని ఆదాయం పెరగనుంది. ఇది కేంద్రానికి శుభవార్తే.

అడ్వాన్స్ ఆధారంగా లెక్కించారు
ఇప్పటి వరకు వసూలైన అడ్వాన్స్ పన్ను ఆధారంగా దీనిని లెక్కించారు. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం. ప్రభుత్వ బడ్జెట్లో మొత్తం పన్ను వసూళ్లు రూ.24.6 లక్షల కోట్లుగా వస్తాయని అంచనా వేయగా అంతకంటే తక్కువే వచ్చాయి.

పెరిగిన కారణం ఇదీ...
కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7.7 లక్షల కోట్లు ఉండవచ్చునని అంచనా. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. 30 శాతం స్లాబ్‌లో ఉంటే ప్రయోజనాలు పొందవచ్చు. 22 శాతం స్లాబ్‌లో ప్రయోజనాలు వదులుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ కంపెనీలు 22 శాతం స్లాబ్‌లోకి వెళ్లేందుకు మొగ్గు చూపాయి. ఇన్ఫ్రా, ఎక్స్‌పోర్ట్స్ ఆధారిత కంపెనీలు మాత్రం పాత పన్ను రేటుతో చెల్లిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వానికి అంచనాలకు మించి కార్పోరేట్ ట్యాక్స్ ఆదాయం పెరిగింది.

ఆ ట్యాక్స్ బెట్టర్‌గా భావించి..
బ్యాంకులు, ఎఫ్ఎంసీజీలకు కొత్త కార్పోరేట్ పన్ను (22 శాతం) లాభదాయకం కావడంతో అవి ఆ స్లాబ్‌లోకి వెళ్లాయని, మౌలిక సదుపాయాలు, ఎగుమతుల్లో కంపెనీలు 30 శాతం బెట్టర్‌గా భావించాయని ట్యాక్స్ ప్రాక్టీస్ కన్సల్టింగ్ నిపుణులు సుధీర్ కపాడియా అన్నారు.


Click it and Unblock the Notifications