జరిమానా నుండి ఐటీ రిటర్న్స్ దాకా: ఈ రోజు పాన్-ఆధార్ లింక్ చేయకుంటే మూల్యం తప్పదు!
పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోవడానికి గడువు నేటితో అంటే మార్చి 31 తేదీతో ముగుస్తోంది. నేటి లోగా ఆధార్-పాన్ లింక్ చేయకుంటే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును పలుమార్లు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించే ఆలోచనలో లేదు. కాబట్టి ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. నేడు దాటితే ఆ తర్వాత పాన్ కార్డు చెల్లిబాటు కాకపోవడం, జరిమానా వంటివి ఉంటాయి.

మరోసారి పొడిగించకుంటే..
పాన్-ఆధార్ లింక్‌కు నేటితో గడువు ముగుస్తోంది. ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. గడువు పొడిగించని పక్షంలో పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఏప్రిల్ 1వ తేదీకి ముందే పాన్-ఆధార్ లింక్ చేయకుంటే ఏమవుతుందంటే...
పాన్-ఆధార్ కార్డును ఈ ఆర్ధరాత్రి లోపు లింక్ చేయకుంటే రూ.1000 వరకు పెనాల్టీ పడుతుంది. అంతేకాదు పాన్ కార్డు ఇన్-ఆపరేటివ్ అవుతుంది.
పాన్ ఆధార్ కార్డును లింక్ చేయకుంటే ఆదాయపు పన్ను చట్టం 1961, కొత్త సెక్షన్ 234H కింద జరిమానా విధిస్తారు.
మార్చి 23న లోకసభలో ఫైనాన్స్ బిల్ పాస్ చేసే సమయంలో ప్రభుత్వం దీనిని నోటిఫై చేసింది.
సెక్షన్ 234H ప్రకారం ఇండివిడ్యువల్స్ పాన్-ఆధార్ కార్డును లింక్ చేయాలి. లేదంటే గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా ఉంటుంది.

ట్రాన్సాక్షన్స్ చేయలేరు
పాన్ కార్డు ఇన్-వాలీడ్ లేదా న్-ఆపరేటివ్ అయితే మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరపలేరు. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు పాన్ నెంబర్ తప్పనిసరి. ఉదాహరణకు ఏదైనా బ్యాంకులో రూ.50,000కు మించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్ నెంబర్ తప్పనిసరి.

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేరు
పాన్-ఆధార్ కార్డును లింక్ చేయకుంటే ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయలేరు. అలాగే కొత్త బ్యాంకు అకౌంట్‌ను ఓపెన్ చేయలేరు. అంతేకాకుండా అధిక టీడీఎస్ చెల్లించవలసి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బీ ప్రకారం పెనాల్టీ రూ.10,000కు మించి పడవచ్చు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ కింద జూలై 1, 2017కు ముందు అలాట్ చేస్తే పాన్ నెంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి.


Click it and Unblock the Notifications