గతవారం రూ.2000 తగ్గిన బంగారం ధర, ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధరలు గతవారం భారీగా క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2000 వరకు క్షీణించింది. రాబోవు సంవత్సరాల్లో వడ్డీ రేటును పెంచుతామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం, ఇతర ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ పెరగడం వంటి వివిధ కారణాలు బంగారం ధరల క్షీణతకు కారణమయ్యాయి. అయితే బంగారం ధరలు ఇంతభారీగా క్షీణించినప్పటికీ, త్వరలో మళ్లీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని, ఈ పరిస్థితుల్లో స్వల్పకాలానికి, దీర్ఘకాలానికి ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు గతవారం గతవారం రూ.49వేలస్థాయి నుండి రూ.47వేల దిగువకు పడిపోయాయి. చివరి సెషన్లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.158 తగ్గి రూ.46,800 వద్ద స్థిరపడింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.182 తగ్గి రూ.47,094 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.71వేల పై నుండి రూ.68వేల దిగువకు పడిపోయాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,580 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68666.00 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ 1764 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 25.828 డాలర్ల వద్ద ముగిసింది.

తగ్గడానికి కారణాలివే
బంగారం ధరలు ప్రస్తుతం రూ.47,000 దిగువకు పడిపోయినప్పటికీ త్వరలో తిరిగి రూ.48500కు చేరుకునే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గతవారం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణాలు రెండు అని, ఒకటి యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు ప్రకటన, రెండోది ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ పెరగడమని వెల్లడించారు.

బంగారం ధరలు వివిధ నగరాల్లో...
బంగారం ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ.50,330గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.44,390, 24 క్యారెట్ల బంగారం రూ.48,290గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.46,410, 24 క్యారెట్ల బంగారం రూ.48,910, ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.46,220 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.47,220గా ఉంది.


Click it and Unblock the Notifications