బంగారం ధరలు మరింత పెరుగుతాయా, పెట్టుబడి ఆప్షన్: 15% వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఈ యుద్ధానికి ముందు రూ.49,000 దిగువన ఉన్న పసిడి, ఇప్పుడు రూ.54,000కు చేరుకుంది. అదే సమయంలో ఎంసీఎక్స్‌లో రూ.48,000 వద్ద ఉండగా, ఇప్పుడు రూ.53,000 దిశగా కనిపిస్తోంది. యుద్ధం కొనసాగితే పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని క్రాస్ చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. పసిడి కొనుగోలుపై ఇప్పుడు కొనుగోలుదారుల్లో తీవ్ర సంధిగ్ధత నెలకొంది.

బంగారం ధరలు అందుకే జంప్
బంగారం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతకుముందు, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన కారణం. పసిడి ప్రధాన తయారీదారు రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు ఉన్నందున, సరఫరా తగ్గుతాయనే భయాలు నెలకొన్నాయి. మరోవైపు, స్టాక్ మార్కెట్ కుప్పకూలి, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి తోడు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణిస్తోంది. దీంతో పసిడి వైపు పెట్టుబడులు పెరిగి ఆకాశాన్నంటుతున్నాయి.

ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో...
పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2075 డాలర్లు. పసిడి ధరలు ఇప్పటికే 1975 డాలర్ల వద్ద ఉంది. ఆల్ టైమ్ గరిష్టానికి 100 డాలర్లు మాత్రమే తక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ మార్కును దాటే అవకాశాలు కొట్టి పారేయలేమంటున్నారు.

మున్ముందు పరిణామాలు అనుకూలమే
పసిడి ధరలు ఈ వారం 1985 డాలర్లను అధిగమిస్తే 2000 డాలర్ల స్థాయిని క్రాస్ చేయవచ్చునని, ఫెడ్ రిజర్వ్ తన విధానంలో మార్పులు చేస్తుందనే అంచనాలు, యుద్ధం, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు పసిడి ధర పెరుగుదలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. పెట్రోల్ ధర పెరిగితే ద్రవ్యోల్భణం పెరిగి, పసిడి ధరల పెరుగుదలకు సానుకూలంగా మారవచ్చునని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మన వద్ద చమురు ధరలు పెరిగితే ఈ ప్రభావం ఉంటుంది.

వివిధ పెట్టుబడి ఆప్షన్స్
క్లిష్ట పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా పసిడి వైపు చూస్తారు ఇన్వెస్టర్లు. అయితే బంగారం కొనుగోలుతో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిశీలించాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కనీసం రూ.1000 నుండి ఇన్వెస్ట్ చేయవచ్చు. డీమ్యాట్ ఖాతా లేకుండా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సంక్షోభ సమయంలో ఇది ఆర్థిక ఇక్కట్ల నుండి కాపాడుతుంది. ఇన్వెస్టర్ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి పది శాతం నుండి 15 శాతం కేటాయించాలని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications