పోస్ట్ ఆఫీస్ ఆదాయంపై పన్ను పడదా? ఈ పొరపాటు చేస్తే ఐటీ నోటీసు గ్యారెంటీ!
చాలా మంది ప్రజలు పోస్ట్ ఆఫీస్ పథకాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే, దాని ద్వారా వచ్చే వడ్డీ అంతా "టాక్స్ ఫ్రీ" అని భావిస్తుంటారు. అయితే, ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 (Income Tax Act, 2025) ప్రకారం, టీడీఎస్ (TDS) నిబంధనలలో కీలక మార్పులు వచ్చాయి. మీరు 2026లో ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేసేటప్పుడు, మీ పోస్ట్ ఆఫీస్ (Post office) ఖాతాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని లెక్క చూపాల్సి ఉంటుంది. లేదంటే ఆదాయపు పన్ను శాఖ నుండి మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ఇతర వనరుల నుండి ఆదాయం (Income from Other Sources)
ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం, మీ జీతం లేదా వ్యాపారం ద్వారా కాకుండా వచ్చే ప్రతి ఆదాయాన్ని 'ఇతర వనరుల నుండి ఆదాయం' కాలమ్‌లో చూపించాలి. ఇందులో బ్యాంకులు , పోస్ట్ ఆఫీసుల నుండి వచ్చే వడ్డీ, షేర్ల డివిడెండ్లు, ఫ్యామిలీ పెన్షన్ వంటివి ఉంటాయి. ఒకవేళ మీకు రావాల్సిన పరిహారంపై వడ్డీ వచ్చినా, దానిని కూడా రిటర్న్స్‌లో వెల్లడించడం తప్పనిసరి.
టీడీఎస్ (TDS) కొత్త రూల్స్ ఏంటి?
ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 393(1) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితిని దాటితేనే బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు టీడీఎస్ కోత విధిస్తాయి.
- సాధారణ పౌరులకు: వడ్డీ ఆదాయం ₹50,000 దాటితే టీడీఎస్ కోస్తారు.
- సీనియర్ సిటిజన్లకు: ఈ పరిమితి ₹100,000 వరకు ఉంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. టీడీఎస్ కట్ అవ్వలేదు అంటే ఆ ఆదాయంపై పన్ను లేదని అర్థం కాదు. మీ మొత్తం ఆదాయం పన్ను పరిమితి దాటితే, మీరు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఏ స్కీమ్స్‌పై పన్ను ఉంటుంది? ఏవి ఫ్రీ?
మీరు ఎంచుకునే పథకాన్ని బట్టి పన్ను నిబంధనలు మారుతుంటాయి..
- పన్ను పడేవి: టైమ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర (KVP) వడ్డీ కూడా మెచ్యూరిటీ సమయంలో పన్ను పరిధిలోకి వస్తుంది.
- మినహాయింపు ఉన్నవి: పీపీఎఫ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSA), , సాధారణ సేవింగ్స్ అకౌంట్లపై వచ్చే వడ్డీకి ప్రస్తుతానికి టీడీఎస్ నుండి మినహాయింపు ఉంది.
సమాచారం దాచిపెడితే ఏమవుతుంది?
ప్రస్తుత డిజిటల్ కాలంలో మీ ప్రతి ఆర్థిక లావాదేవీ ఆదాయపు పన్ను శాఖకు ముందే తెలిసిపోతుంది. మీ 'యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్' (AIS) , ఫామ్ 26AS లో మీ పోస్ట్ ఆఫీస్ (Post office) వడ్డీ వివరాలు అన్నీ నిక్షిప్తమై ఉంటాయి. మీరు ఐటీ రిటర్న్స్‌లో ఈ వివరాలు చూపించకుండా దాచిపెడితే, వెంటనే మీకు ఐటీ నోటీసు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న పొరపాటు చేసినా భారీ పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత అనేది చాలా ముఖ్యం. పోస్ట్ ఆఫీస్ (Post office) లో మీరు చేసే ప్రతి పెట్టుబడి వివరాలను, దాని ద్వారా వచ్చే వడ్డీని సరిగ్గా లెక్కగట్టి ఐటీ రిటర్న్స్‌లో వెల్లడించండి. దీనివల్ల అనవసరమైన చట్టపరమైన చిక్కుల నుండి తప్పించుకోవచ్చు. పెట్టుబడి పెట్టేముందే ఆ స్కీమ్ పన్ను పరిధిలోకి వస్తుందో లేదో మీ ట్యాక్స్ కన్సల్టెంట్‌ను అడిగి తెలుసుకోవడం ఉత్తమం.


Click it and Unblock the Notifications