అప్పుల సుడిగుండంలో చిక్కకూడదంటే ఇవిగో స్మార్ట్ చిట్కాలు.. డోన్ట్ మిస్..!!
Financial Planning: ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా ప్రజల జీతాలకు తగినట్లుగానే మార్కెట్లో ఖర్చులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. చాలా మందికి అలా జీతం రాగానే గంటల్లో ఖాళీ అయిపోతుంటుంది. దీనికి కారణం అనేక మందికి జీతం కంటే ఎక్కువగా ఖర్చులు ఉండటమే. ఇలాంటి సమయంలోనే చాలా మంది అప్పుల కోసం వివిధ రుణ మార్గాలను అన్వేషిస్తుంటారు. లేదా అవసరమైన వస్తువులను ఈఎంఐలలో కొనుగోలు చేస్తుంటారు.
అయితే ప్రజలు తమ అవసరాల కోసం నిరంతరం కొత్త రుణాలపై ఆధారపడటంతో ఒకానొక స్థాయిలో వాటిని తిరిగి చెల్లించటం కూడా కష్టతరంగా మారే స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఇలా డబ్బు చెల్లించలేని పరిస్థితిలోకి దిగజారకుండా నివారించటానికి ఆర్థిక మెళకువలతో సమర్థవంతంగా ముందుకు సాగటం చాలా ముఖ్యం. మల్టిపుల్ రుణాలను నిర్వహించడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

ప్రతినెల జీతం వచ్చిన తర్వాత ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఈ విధంగా మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు, అవసరమైన అవసరాలపై దృష్టి పెట్టవచ్చు. ఇలాంటి ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, రుణాన్ని తిరిగి చెల్లించడం కొంచెం సులభం. లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐలను సకాలంలో చెల్లించడం ముఖ్యం. ఇది వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే సకాలంలో చెల్లింపుల కోసం గుర్తుంచుకునేందుకు రిమైండర్లు ఏర్పాటు చేసుకోవటం మంచిది. అకౌంట్లో ముందుగానే డబ్బు ఉంచి ఆటో డెబిట్ ఆన్ చేయటం కూడా సకాలంలో పేమెంట్స్ అవటానికి దారితీస్తుంది.
నెలవారీ ఈఎంఐ మొత్తాన్ని తగ్గించడానికి కొందరు లోన్ కాలపరిమితిని పొడిగిస్తారు. ఇలా చేయటం వల్ల దానిపై అధిక వడ్డీని చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. తక్కువ వ్యవధిలో రుణం చెల్లించినప్పుడు వడ్డీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే 10 ఏళ్లలోపు పూర్తి చేసే రుణాన్ని 20 ఏళ్లకు పొడిగిస్తే నెలవారీ ఈఎంఐ భారం తగ్గినప్పటీ అంతిమంగా చెల్లించే మెుత్తం ఎక్కువ అవుతుంది. అలాగే మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్న ఆర్థిక సంస్థలను ఇందుకోసం ఎంచుకోవటం వల్ల చెల్లించాల్సిన మెుత్తం కూడా తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.
ఇప్పటికే రుణం తీసుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వెంటనే రుణాన్ని చెల్లించడానికి పొదుపు చేసిన మెుత్తాన్ని ఉపయోగించవచ్చు. సాధారణంగా రుణాలు తీసుకునేటప్పుడు విడివిడిగా కాకుండా ఒకే రుణంగా తీసుకోవడం మంచిది. దీని ద్వారా ఈఎంఐ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ వడ్డీకే రుణం పొందటంతో పాటు ఏకకాలంలో ఒక్కటే ఈఎంఐని నిర్వహించటం సులభతరంగా ఉంటుంది. ఆర్థిక సలహాదారుని ఎంచుకోవడం ద్వారా వ్యక్తులు తన ఆర్థిక పరిస్థితి గురించి సలహాలు పొందవచ్చు. సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications