ఇటీవల దేశ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 12 వేలకు పైగా ఉద్యోగాలను తగ్గించడంతో భారతీయ ఐటీ రంగంలో ఉద్యోగులకు భయాందోళనలు పెరిగాయి. AI ఆధారిత టెక్నాలజీల విస్తరణ, అమెరికా టారిఫ్ అనిశ్చితి, బలహీనమైన IT సేవల డిమాండ్ వంటి కారణాలు ఈ తొలగింపులకు దారితీశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినపుడు ఆర్థికంగా ఎలా తట్టుకోవాలో తెలుసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగం పోగానే వెంటనే ప్రతి ఒక్కరు ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందడం సహజమే. అయితే మీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఉండటం అనేది చాలా ముఖ్యం. మీ ప్రాథమిక ఖర్చులను గుర్తించి, ఉన్న పొదుపులు, FDలు, మ్యూచువల్ ఫండ్లు వంటి వనరులను ఓసారి సమీకరించండి. కనీసం 6 నెలల వరకు అవసరమైన ఖర్చులను కవర్ చేయగల సేఫ్టీ నెట్‌ను ఏర్పరచుకోండి. ముఖ్యంగా హౌసింగ్ లోన్, స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె వంటి తప్పనిసరి ఖర్చులను ముందుగా లెక్కించుకుని ప్లాన్ వేసుకోండి.

ఉద్యోగం కోల్పోయిన 4-6 నెలల తర్వాత మీరు మిడ్-టర్మ్ దశలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ దశలో మీరు జీవిత శైలిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.తక్కువ అద్దె ఇంటికి మారడం, ప్రయాణం, డైనింగ్ ఖర్చులను తగ్గించడం. పిల్లలను తక్కువ ఫీజులు ఉన్న స్కూళ్లకు మార్చడం వంటి దశలపై ఓ సారి ఆలోచన చేయండి
ఇక గిగ్-ఎకానమీలో తాత్కాలిక ఉద్యోగాలు (Swiggy, Zomato, Flipkart లాంటి సంస్థలలో) చేపట్టి తక్షణ ఆదాయం పొందేందుకు ప్రయత్నించండి. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో మీ నెట్‌వర్క్‌లో ఫ్రీలాన్సింగ్ అవకాశాలను ఓ సారి వెతకండి.. దొరికితే అందులో వెంటనే చేరిపోండి.
ఉద్యోగం కోల్పోయిన ఆరు నెలల తర్వాత కూడా మీకు ఆదాయం లేకపోతే.. అసాధారణ ఆర్థిక వ్యూహాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. బీమా పాలసీలపై ఓవర్‌డ్రాఫ్ట్, మ్యూచువల్ ఫండ్లపై రుణాలు వంటి ఎంపికలను ఓసారి ఉపయోగించండి. అయితే ఇవి తాత్కాలిక పరిష్కారాలే కాబట్టి మీకు రుణభారం పెరగకుండా జాగ్రత్త వహించేందుకు తోడ్పడతాయి.
భవిష్యత్తుకు సిద్ధమయ్యే క్రమంలో స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడం కూడా చాలా అత్యవసరం. పాత టెక్నాలజీలను వదిలి, Python, AI, Cloud Computing వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. LinkedIn వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో నెట్‌వర్కింగ్ చేయడం ద్వారా అవకాశాల కోసం ప్రయత్నించండి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications