గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) పన్ను చెల్లింపుల్లో ఆలస్యమైతే వడ్డీ చెల్లించక తప్పని పరిస్థితి. ఈ నిబంధన సెప్టెంబర్ 1, 2020 నుండి అమల్లోకి రానుంది. నికర జీఎస్టీ బకాయిలపై ఈ వడ్డీని వసూలు చేయనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆప్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC) తెలిపింది. మార్చిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ఇది అమల్లోకి రానుంది.

రూ.46,000 కోట్ల చెల్లించని వడ్డీని రికవరీ చేయాలని..
జీఎస్టీ చెల్లింపులు ఒకవేళ ఆలస్యమైతే నికర పన్ను బకాయిలపై వడ్డీని కట్టవలసి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ చెల్లింపుల ఆలస్యం కారణంగా రూ.46,000 కోట్ల చెల్లించని వడ్డీని రికవరీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై పరిశ్రమ ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుడు వడ్డీని స్థూల పన్ను బకాయిలపై లెక్క గట్టారు.

చెల్లింపుదారులకు ఊరట..
39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ పాత గడువు కాలానికి ఎలాంటి వడ్డీని రికవరీ చేయబోమని, ఈ మేరకు హామీ ఇస్తున్నామని, పన్ను చెల్లింపుదారులకు ఇది పూర్తిస్థాయి ఊరట అని జీఎస్టి కౌన్సిల్ తెలిపింది. జూలై 1, 2017 నుండి నెట్ ట్యాక్స్ లయబిలిటీస్ లేట్ పేమెంట్స్ పైన ఛార్జీ ఉండనుంది.

నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ
ఇదిలా ఉండగా, జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన ఆదాయానికి హామీ ఇచ్చినట్లుగా పరిహారాన్ని ఇవ్వాలని బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు గురువారం జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌లో ఒత్తిడి తీసుకు రానున్నారు. నేటి జీఎస్టీ సమావేశంలో టూ-వీలర్స్ పైన జీఎస్టీ తగ్గింపుపై పరిశ్రమ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తే ఒక్కో వాహనంపై కొనుగోలుదారులకు భారీగా ఆదా అవుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications