అందుకే పెరుగుతున్న బంగారం ధరలు... ప్రీమియం వసూలు చేస్తున్న ట్రేడర్లు!
భారత్ లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగి తులం బంగారం (10 గ్రాములు) రూ 50,000 లకు చేరువ అయ్యాయి. అయినా సరే వినియోగదారులు కొంటూనే ఉన్నారు. భారతీయులకు, బంగారానికి విడదీయలేని సంబంధం ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు అధిక స్థాయిలో సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో అమ్మకాలు సహజంగానే మరింతగా పుంజుకుంటాయి. అయితే, ప్రస్తుతం ఇండియా లో బంగారం ధరలు ఇంతలా పెరగటానికి మాత్రం కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. కానీ మన దగ్గర వినియోగానికి తగినంత బంగారం నిల్వలు లేవు. కాబట్టి, ఇండియా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే సరుకుల డెలివరీ ఆలస్యం అవుతోంది. అనేక ఆంక్షల నడుమ దిగుమతులు ప్రభావితం అవుతున్నాయి. అది కాస్త స్థానికంగా ఉండే బంగారం ట్రేడర్లు వరంగా మారిపోయింది. ఇదే అదనుగా ధరలు అమాంతం పెంచేస్తున్నారు.

86% తగ్గిన దిగుమతులు...
కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. గతేడాది జూన్ తో పోల్చితే ప్రస్తుత జూన్ లో బంగారం దిగుమతులు 86% పడిపోవటం గమనార్హం. సాధారణంగా భారత్ ఏటా సుమారు 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే సగటున నెలకు 70 టన్నుల నుంచి 80 టన్నుల మేరకు బంగారం దిగుమతి అవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్ డౌన్ లో దాదాపు 99% గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిపోగా... మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంత మేరకు పుంజుకుంటున్నాయి. కానీ సాధారణ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం 15% మేరకు దిగుమతులు జారుతుగున్నయి. దిగుమతులు తక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం బంగారం ధరల పై పడుతోంది.

25% అధిక ధరలకు విక్రయం...
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలతో పోల్చితే... ఇండియా లో ప్రస్తుతం గోల్డ్ ధరలు సుమారు 25% అధికంగా ఉన్నాయి. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థను ఉంటంకిస్తూ మింట్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధరలు రికార్డు స్థాయిలో రూ 49,500 కు చేరుకున్న విషయం తెలిసిందే. దిగుమతులు తక్కువగా ఉండటంతో పాటు డిమాండ్ కొనసాగుతుండటంతో ట్రేడర్లు ఈ అవకాశాన్ని కాష్ చేసుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల సంభవించిన సంక్షోభంలో బంగారమే సురక్షితమైన పెట్టుబడి సాధనం అని వినియోగదారులు అటు వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో డాలర్ తో పోల్చితే రూపాయి బలహీన పడటం కూడా దీనికి కొంత ఊతమిస్తోంది.

అక్కడి నుంచి దిగుమతులు..
ముందే చెప్పుకున్నట్లు ఇండియా సగటున ప్రతి ఏటా సుమారు 1,000 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రధానంగా ఇండియా కు వచ్చే బంగారం ఆఫ్రికా దేశమైన ఘనా, లాటిన్ అమెరికన్ దేశమైన పెరూ తో పాటు స్విట్జర్లాండ్ నుంచి అధికంగా దిగుమతి అవుతుంది. ఆ తర్వాత స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి గోల్డ్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. అనధికారికంగా థాయిలాండ్ వంటి దేశాల నుంచి కూడా మన దేశానికి కొంత బంగారం అక్రమ మార్గాల్లో వస్తుందని విశ్లేషకులు చెబుతారు. ఐతే ప్రస్తుతం దాదాపు అన్ని రకాల అంతర్జాతీయ మార్గాలు మూసుకు పోవటంతో ప్రస్తుతం ఇండియాలో బంగారం ధరలు భగ్గు మంటున్నాయి. పరిస్థితి త్వరలో చక్కబడకపోతే గోల్డ్ ధరలు మరింత పైకి పోయే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications