Gold prices today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే, రూ.48,000 దిగువనే ఉంటుందా?
బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ప్రారంభమయ్యాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నేటి (డిసెంబర్ 6) ప్రారంభ సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6 పెరిగి రూ.47,909 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.7 లాభపడి రూ.48,072 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం స్వల్పంగా తగ్గింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.70 డాలర్లు పెరిగి 1783.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1783 వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో దాదాపు 4 శాతం క్షీణించింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.92 లాభపడి రూ.61,608 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్ 22.480 డాలర్ల వద్ద ఉంది.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8300 తక్కువ
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8300 వరకు తక్కువగా ఉంది. సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో చూస్తే రూ.17000కు పైగా తక్కువగా ఉంది. గత శుక్రవారం అమెరికా నిరుద్యోగ డేటా విడుదలైంది. ఈ డేటా కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ఉంది. అయితే నిరుద్యోగిత రేటు 4.2 శాతంతో 21 నెలల కనిష్టానికి చేరుకుంది. నాన్-ఫామ్ ఎంప్లాయిమెంట్ 5,53,000 అంచనా వేయగా, 2,10,000కు తగ్గింది. అలాగే, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, టెన్ ఇయర్ బాండ్స్ వంటి అంశాలు పసిడి పైన ప్రభావం చూపుతాయి.
ఆర్థిక ప్యాకేజీని తగ్గించి, వడ్డీ రేటును క్రమంగా పెంచడం ద్వారా బాండ్ యీల్డ్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. ఇవి కూడా పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి.

రూ.48,000 దిగువనే ఉంటుందా
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావం బంగారంపై కనిపిస్తుంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చాలామంది మొగ్గు చూపారు. దీంతో పసిడి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఒమిక్రాన్ కారణంగా ఇప్పటికే యూరోప్‌తో పాటు పలు దేశాలు తాజాగా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్‌ను అమలు చేస్తున్నాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నప్పటికీ, దాదాపు స్థిరంగా ముగుస్తాయని భావిస్తున్నారు. పసిడి కూడా ఊగిసలాటలో ఉండి, దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.48,000కు దిగువన ముగిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మద్దతు, నిరోధకం
ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,700 నుండి రూ.47,500. నిరోధకస్థాయి రూ.48,200 నుండి రూ.48,400. వెండి మద్దతు ధర రూ.61,200 నుండి రూ.60,700. నిరోధకస్థాయి రూ.62,100 నుండి రూ.62,700.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1772-1758 డాలర్లు. నిరోధకస్థాయి 1796-1810 డాలర్లు. వెండి మద్దతు ధర 22.34-22.10 డాలర్లు. నిరోధకస్థాయి 22.80-23.00 డాలర్లు.


Click it and Unblock the Notifications