Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం ధరలు, మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా?
బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వారం రూ.53,000 క్రాస్ చేసి, 54,000 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్, ఈ రెండు రోజుల్లో రూ.800 వరకు తగ్గింది. నిన్న రూ.500 వరకు వరకు తగ్గిన పసిడి ఫ్యూచర్, నేడు మరో రూ.300 తగ్గింది. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్నప్పటికీ, మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల రూ.70,000 దాటిన సిల్వర్ కూడా ఇప్పుడు రూ.68,000 స్థాయికి వచ్చింది. రెండు రోజుల్లో రూ.1700కు పైగా తగ్గింది.

నిన్న భారీగా తగ్గుదల
బంగారం ధరలు క్రితం సెషన్‌లో భారీగా క్షీణించాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.512 తగ్గి రూ.52,760 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500 క్షీణించి రూ.53,030 వద్ద ముగిశాయి. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా నిన్న రూ.1100కు పైగా క్షీణించింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1176 లేదా 1.68 శాతం తగ్గి రూ.68,800, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1129 లేదా 1.60 శాతం క్షీణించి రూ.69,570 వద్ద ముగిసింది.
నేడు (ఏప్రిల్ 20) జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.290 క్షీణించి రూ.52,460 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.304 తగ్గి రూ.52,710 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.432 తగ్గి రూ.68,338 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.472 తగ్గి రూ.69,050 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1950 డాలర్ల దిగువకు వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వార్త రాసే సమయానికి 12.80 డాలర్లు క్షీణించి 1946.20 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.231 డాలర్లు క్షీణించి 25.160 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 2000 డాలర్ల దిశగా కనిపించింది. కానీ అంతలోనే దాదాపు 50 డాలర్లు క్షీణించింది.

తగ్గాయి కానీ...
బంగారం ధరలు నిన్న 1950 డాలర్ల దిగువన ముగిశాయని, ప్రధానంగా అమెరికా డాలర్ వ్యాల్యూ పెరగడం, బాండ్ యీల్డ్స్ పెరగడం వంటి అంశాలు ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మార్కెట్ దిగ్గజాలు మంచి లాభాల దిశగా అడుగు వేస్తున్న నేపథ్యంలో అమెరికా ఈక్విటీ మార్కెట్ రికవరీ బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.
అయితే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్భణ ఆందోళనలు, చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణత వంటి అంశాలు మున్ముందు బంగారానికి సానుకూలం కావొచ్చునని భావిస్తున్నారు. దీంతో పసిడి ధరలు తిరిగి పుంజుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 1940-1920 డాలర్ల మధ్య మద్దతు, 1960-1975 డాలర్ల మధ్య నిరోధకం కనిపిస్తోందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications