బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే? ఆభరణాల కంటే ఇవీ బెస్ట్!
బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్ట్ 10 గ్రాముల ధర 0.3 శాతం తగ్గి రూ.48,210 పలికింది. గత ఐదు సెషన్‌లలో నాలుగు సెషన్లలో ధర తగ్గింది. కేవలం ఒకరోజు మాత్రమే పెరిగింది. అయితే కరోనా ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నారు. దీంతో స్వల్ప పెరుగుదల నమోదవుతోంది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి కిలో రూ.49,691 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం 0.34 పెరగగా, వెండి 1.2 శాతం పెరిగింది. అంతకుముందు వారం ఎంసీఎక్స్‌లో బంగారం రూ.48,982 రికార్డ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే.

బంగారం ధరల్లో స్వల్ప మార్పులు
బంగారం ధర ఎంసీఎక్స్‌లో ఉదయం రూ.48,000 దిగువకు కూడా చేరుకుంది. అయితే ఆ తర్వాత స్వల్పంగా పెరిగింది. పదకొండు గంటల సమయంలో రూ.48,300కు చేరుకుంది. కరోనా కేసులు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్వల్ప మార్పులతో దాదాపు స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,784.99 డాలర్లకు చేరుకుంది. తద్వారా ఎనిమిదేళ్ల గరిష్ట ధర 1,788.96 డాలర్ల సమీపానికి చేరుకుంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషాయనికి వస్తే ప్లాటినమ్ ఔన్స్ ధర 1.1 శాతం ఎగిసి 821.76 డాలర్లకు, వెండి ధర 0.5 శాతం ఎగిసి 18.30 డాలర్లకు పెరిగింది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు
ప్రస్తుతం కరోనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు, స్థానిక కరెన్సీ కదలికలు, సుంకాలు తదితర ప్రభావం ఉంటుంది. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా చెన్నైలో రూ.46,110, రూ.50,720, ముంబై రూ.46,960, రూ.47,960, ఢిల్లీలో రూ.46,910, రూ.48,110, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.47,260, రూ.45,360, రూ.46,110, 24 క్యారెట్ల బంగారం రూ.48,560, రూ.49,460, రూ.50,720గా ఉంది.

బంగారంపై ఇన్వెస్ట్.. ఆభరణాలకు దూరంగా ఉండండి
బంగారంలో పెట్టుబడుల కోసం ఆభరణాలు వద్దని సూచిస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం బంగారం బెస్ట్ అని, కానీ ఆభరణాలకు మాత్రం సరికాదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేసిన వారు వాటిని తిరిగి విక్రయించిన సమయంలో తరుగు రూపంలో నష్టపోతారు. కాబట్టి ఆభరణాల రూపంలో పెట్టుబడి మాత్రం మంచి ఆప్షన్ కాదని సూచిస్తున్నారు.

మరి ఎందులో పెట్టుబడులు పెట్టాలి?
బంగారాన్ని ఆభరణాల రూపంలో పెట్టుబడి పెట్టడం కంటే గోల్డ్ ఈటీఎఫ్, ఆర్బీఐ జారీ చేసే సావరీన్ గోల్డ్ వంటి రూపాల్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతో మంచి ఎంపికగా చెబుతున్నారు. ఇప్పటికే ఆర్బీఐ మరో విడత గోల్డ్ బాండ్స్ జారీని నిన్నటి నుండి జారీ చేస్తోంది.


Click it and Unblock the Notifications