నిన్న(ఆగస్ట్ 31) పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల నమోదు కావడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.1 శాతం పెరిగి రూ.51,504 పలికింది. పసిడి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.4 శాతం ఎగిసి కిలో రూ.69,135 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి రూ.500 పెరగగా, వెండి వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. పసిడి ధరలు ఆగస్ట్ గరిష్ట ధర రూ.56,200తో పోలిస్తే ఇప్పటికీ రూ.4,600 వరకు తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.500 వరకు పెరిగి, రూ.54,040 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.400కు పైగా తగ్గి రూ.49,550 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.50,350 పలకగా, 24 క్యారెట్ల పసిడి రూ.54,900 పలికింది. రష్యా వ్యాక్సీన్ వచ్చిన అనంతరం భారీగా తగ్గిన పసిడి ధరలు గత ఇటీవల స్వల్పంగా పెరుగుతున్నాయి.

భారీ రిటర్న్స్
ఈ ఏడాదిలో పసిడి ధరలు దాదాపు 40 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో పసిడి ధరలు ఔన్స్ 2,080 వరకు చేరుకున్నాయి. ఇప్పుడు 2000 డాలర్ల లోపు పలుకుతోంది. ఎంసీఎక్స్‍లో రూ.56వేలు దాటిన పసిడి ఇప్పుడు రూ.51వేలకు అటు ఇటుగా ఉంది. బంగారం ధరలు రూ.50వేలకు పైన ఉన్న ఈ సమయంలో పెట్టుబడి పెట్టవచ్చా, మరింత తగ్గుతాయా, పెరుగుతాయా అనే డైలమా చాలామందిలో ఉంది. అయితే వ్యాక్సీన్, కరోనా కేసులపై ఇది ఆధారపడి ఉంటుంది.

రూ.56,000 చేరుకుంటుందా?
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కుదురుకున్నాయి. అయితే దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే చైనాతో సరిహద్దు టెన్షన్ నేపథ్యంలో నిన్న కుప్పకూలింది. వ్యాక్సీన్ రాక త్వరగా ఉంటే పసిడి ధరలు మరింతగా పడిపోతాయి. ఆలస్యమైతే పెరగవచ్చు. కానీ దీర్ఘకాలంలో పెట్టుబడులకు మాత్రం అనుకూలమని చెబుతున్నారు. పండుగ సీజన్ వచ్చేసింది. పసిడి ధరలు తిరిగి పుంజుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీర్ఘకాలానికి లేదా భౌతిక బంగారం అవసరాన్ని బట్టి రూ.51,000 వద్ద కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. దీపావళి నాటికి తిరిగి రూ.56వేలకు లేదా ఆ సమీపానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. తగ్గితే రూ.50వేల వద్ద కొంతకాలం స్థిరంగా ఉండవచ్చునని అంటున్నారు. డాలర్ మారకంటో రూపాయి 75కు చేరితే బంగారానికి మద్దతు ఇస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications