4 నెలల గరిష్టాన్ని తాకి... వారంలో రెండురోజులు తగ్గిన బంగారం ధరలు
భారత దేశంలో బంగారం ధరలు గతవారం అస్థిరంగా కదలాడాయి. ఓ సమయంలో నాలుగు నెలల గరిష్టాన్ని తాకిన ధరలు ఆ తర్వాత కాస్త క్షీణించాయి. దేశీయ ప్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి తర్వాత మొదటిసారి గత బుధవారం రూ.48,830ని తాకి గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. చివరకు పసిడి ఫ్యూచర్ శుక్రవారం రూ.48,439 వద్ద క్లోజ్ అయింది. వెండి ధరలు కూడా అస్థిరంగా కదిలాయి. మంగళవారం కిలో రూ.74,200ను తాకాయి. చివరకు రూ.71,000 స్థాయిలో ముగిశాయి.

మద్దతు ధర
ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.46,920, నిరోధకస్థాయి రూ.49,600గా ఉండవచ్చునని గోల్డ్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్ గతవారంలో 1880 డాలర్ల వద్ద ముగిసింది. కామెక్స్‌లో బంగారం దిద్దుబాటుకు గురి కావొచ్చునని, 1798 డాలర్ల వద్ద బ్రేక్ ఉండవచ్చునని చెబుతున్నారు. క్రితం శుక్రవారం నాటికి డాలర్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగి 90.015 వద్ద ముగిసింది. యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అంచనాలకు మించి డాలర్ బలపడింది.

ఆర్థిక రికవరీ ఆశాజనకం
ఈ నెల ప్రారంభంలో యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 61.5 వృద్ధి సాధించిందని, అక్టోబర్ 2009 తర్వాత ఇలా వృద్ధి సాధించడం ఇదే మొదటిసారి అని డేటా సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది. అమెరికా ఆర్థిక రికవరీ జోరందుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

గత వారం ముగింపు
గత వారం బంగారం, వెండి ధరలు ప్రారంభంలో భారీగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత స్వల్ప తగ్గుదలతో ముగిశాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,439 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,910 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.73వేలు దాటి, ఆ తర్వాత 71వేల స్థాయికి వచ్చింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.71100.00 వద్ద, సెప్టెంబర్ ఫ్యూచర్స్ 72200.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 1,881.85 డాలర్లు, వెండి 27.650 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications