కొనుగోలు చేయవచ్చా: 2021 తొలి అర్ధఏడాదిలో బంగారం ఎంత పెరగవచ్చునంటే?
ముంబై: బంగారం ధరలు 2021 బౌన్స్ బ్యాక్ అవుతాయా? అంటే అవుననే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఆగస్ట్ 7వ తేదీన 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్ రూ.56,200 పలకగా, ఈ నెలలో ఆ స్థాయి నుండి క్రమంగా క్షీణించి రూ.47,500కు దిగి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ రూ.50,000 వైపు సాగింది. అమెరికా డాలర్ రెండున్నరేళ్ల కనిష్టాన్ని తాకడంతో పసిడి ధరలు పైపైకి లేస్తున్నాయి. అమెరికా ఆర్థిక ప్యాకేజీ ఆశల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సీన్ పైన ప్రకటనల ప్రభావం కూడా బంగారంపై ఉంటోంది. సానుకూల ప్రకటన వస్తే ధర తగ్గడం, అననుకూలంగా ఉంటే పెరగడం జరుగుతోంది.

12 నెలల్లో బంగారంపై వీటి ప్రభావం.. ఈక్విటిపై దృష్టి
సమీప భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతూ, క్షీణిస్తున్నప్పటికీ లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా తక్కువ వడ్డీ రేట్లు, కరోనాను అధిగమించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ ఆశలు, డాలర్ సూచీ వంటి అంశాలు రానున్న 6 నెలల నుండి 12 నెలల్లో పసిడిపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు.
కరోనా వ్యాక్సీన్ పైన సానుకూల ప్రకటనలు రావడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి కాస్త డిమాండ్ తగ్గింది. ఇన్వెస్టర్లు, సంస్థలు ఈక్విటీ మార్కెట్ వంటి రిస్క్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటే ఈక్విటీ మార్కెట్ పుంజుకుంటుంది. అందుకే అటువైపు చూస్తారు.

బంగారం పెరుగుదల.. తగ్గుదలపై ఈ ప్రభావం
ఇటీవల బంగారం, అమెరికా డాలర్ రెండు కూడా పడిపోయాయి. ఇది అరుదైన అంశం. ఓ వైపు లాక్ డౌన్ కారణంగా చైనా, భారత్ నుండి భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇవి ధరలను దెబ్బతీయగా, ఉద్దీపన ప్యాకేజీ, ద్రవ్యోల్భణం పెరుగుదల బంగారం ధరలకు మద్దతు ఇచ్చింది.

రూ.52,500 దిశగా...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 1870 డాలర్లు, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.50,000 సమీపంలో ఉంది. రాబోయే ఆరు నెలల్లో బంగారం ధరను రూ.52,500 టార్గెట్‌తో రూ.48,000 నుండి రూ.48,500 మధ్య కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. వెండి ధర కూడా వచ్చే ఆరు నెలల్లో కిలో రూ.70,000 స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications