బంగారం రూ.52,000 వద్ద ఆగిపోతుందా, మార్చి దిశగా సాగుతోందా?
బంగారం ధరలు మంగళవారం (సెప్టెంబర్ 15) పెరిగాయి. కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 2.9 కోట్లకు పైకి చేరుకోగా, భారత్‌లో 50 లక్షలకు చేరువయ్యాయి. దీనికి తోడు యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ, డాలర్ వ్యాల్యూ క్షీణించడం వంటి వివిధ కారణాలు పసిడిపై ఒత్తిడిని పెంచాయి. ప్రధానంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో బులియన్ కౌంటర్‌లో కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో ఈ రోజు పసిడి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి.

రూ.52,000 మద్దతు ధర
మధ్యాహ్నం సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి 0.30 శాతం లేదా రూ.203 ఎగిసి 10 గ్రాములు రూ.51,890 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.67 శాతం లేదా రూ.463 పెరిగి కిలో రూ.69,430 పలికింది. బంగారం ధరలు అస్థిరంగానే కొనసాగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో రూ.51,800 నుండి రూ.52,000 మధ్య నిరోధకస్థాయి అని చెబుతున్నారు. మద్దతు ధర రూ.51,300 నుండి రూ.51,500గా చెబుతున్నారు. అంటే బంగారం ధరలు రూ.52వేలు దాటే అవకాశాలు కనిపించడం లేదు. అయితే వ్యాక్సీన్, కరోనా వంటి కేసులు ప్రభావం చూపడం వేరే విషయం.

2000 డాలర్లు నిరోధకస్థాయి.. మార్చి దిశగా..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.3 శాతం ఎగిసి ఔన్స్ 1,962.78 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్లో 0.8 శాతం ఎగిసింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి 1,972.60 డాలర్లు పలికింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి 1992 డాలర్ల నుండి 2000 డాలర్ల మధ్య నిరోధకస్థాయి అని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ దీనిని దాటితే 2015 వద్ద నిరోధకస్థాయిగా చెబుతున్నారు. మద్దతు ధర 1930 నుండి 1950 డాలర్లు. పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి మార్చి దిశగా వెళ్తోందని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఆ మేరకు తగ్గినా తగ్గకపోయినా.. మరింతగా తగ్గుతుందనే సంకేతాలు ఇస్తున్నారు.

బంగారం ధర పెరిగింది
బంగారం ధరలు ఈ రోజు ఉదయం బులియన్ మార్కెట్లోను పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల పసిడి రూ.200 వరకు పెరిగి రూ.53,500కు పైగా, 22 క్యారెట్ల పసిడి రూ.49 వేలకు పైగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.54,500 పైకి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.50వేలకు అటుఇటుగా ఉంది.


Click it and Unblock the Notifications