రూ.50,000 స్థాయికి దిగివచ్చిన బంగారం, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
బంగారం ధరలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నేటి ఉదయం స్వల్పంగా పెరిగాయి. ఆ తర్వాత బులియన్ మార్కెట్లో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ప్రారంభ సెషన్‌లో అక్టోబల్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం ఎగిసి 10 గ్రాములు రూ.51,140 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 0.6 శాతం లాభపడి రూ.64,380 చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో బంగారం 0.5 శాతం, వెండి రెండు శాతం పడిపోయింది. ఆగస్ట్ 7వ తేదీ గరిష్ట రికార్డ్ ధర కంటే పసిడి రూ.5,000 తక్కువగా ఉంది.

రూ.50వేల స్థాయికి బంగారం ధరలు
ఎంసీఎక్స్‌లో తొలుత పెరిగిన పసిడి ధరలు ఆ తర్వాత పతనమయ్యాయి. ఈ నెలలో రూ.56 వేల పైకి చేరుకున్న 10 గ్రాముల బంగారం ఈ రోజు రూ.50 వేల స్థాయికి పడిపోయింది. రష్యా వ్యాక్సీన్ వచ్చినప్పటి నుండి పసిడి ధరల్లో క్షీణత ప్రారంభమైంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.50700 దిగువకు చేరుకుంది. కిలో వెండి రూ.63,500 స్థాయికి దిగి వచ్చింది. పసిడి ఈ నెల గరిష్టస్థాయి నుండి దాదాపు రూ.5,500 వరకు దిగి వచ్చింది.

బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.54,500 స్థాయికి వచ్చింది. 22 క్యారెట్ల పసిడి రూ.50వేలకు చేరుకుంది. రూ.66వేలకు పైగా ఉన్న వెండి ధర ఇప్పుడు రూ.65వేలస్థాయికి దిగి వచ్చింది. కరోనాకు మెరుగైన చికిత్స, వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు, అమెరికా-చైనా ట్రేడ్ వార్ సానుకూల సంకేతాలు, రూపాయి బలపడటం వంటి అంశాలు ధరలు తగ్గడానికి కారణం.

10 శాతం వరకు పడిపోయిన ధరలు
బంగారం ధరలు ఈ నెల గరిష్టం నుండి రూ.5వేల నుండి రూ.6వేల మధ్య పడిపోయాయి. అంటే దాదాపు 10 శాతం వరకు తగ్గాయి. ఇంతలా పడిపోయినప్పటికీ కొనుగోలుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదు. వ్యాక్సీన్ వస్తే ధరలు మరింతగా పడిపోతాయేమోనని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా అంటే దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చునని అంటున్నారు. దీర్ఘకాలంలో పసిడి సురక్షిత పెట్టుబడి. ఇప్పటికే రష్యా వ్యాక్సీన్ కారణంగా దారుణంగా పతనమైందని, ఇతర వ్యాక్సీన్లు వచ్చినా మరో 5 శాతం లోపు పడిపోయే అవకాశాలు మాత్రమే ఉండవచ్చునని అంటున్నారు. దీర్ఘకాలంలో అయితే బెట్టర్ ఆప్షన్ అంటున్నారు.


Click it and Unblock the Notifications