6 నెలల కనిష్టానికి బంగారం ధరలు, మరింత పతనమవుతుందా?
బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర నేడు ప్రారంభ సెషన్‌లో (సోమవారం 20) రూ.56.00 (-0.12%) క్షీణించి రూ.45,930 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.98.00 (-0.21%) తగ్గి రూ.46055.00 వద్ద ట్రేడ్ అయింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.45,900 దిగువకు కూడా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల దిగువకు పడిపోయింది.
ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 0.010 (0.01%) డాలర్లు క్షీణించి 1,751.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్ ఏకంగా రూ.60,000 డాలర్ల దిగువకు చేరుకుంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.252.00 (-0.42%) తగ్గి రూ.59740.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.286.00 (-0.47%) క్షీణించి రూ.60527.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.073 (+0.33%) డాలర్లు క్షీణించి 22.410 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మరింత పతనమవుతుందా?
బంగారం ధరలు ప్రస్తుతం ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. వెండి రేట్లు కూడా భారీగానే పతనమయ్యాయి. ఈ నెలలో దేశీయ ప్యూచర్ మార్కెట్లో రూ.48,000 సమీపానికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఏకంగా రూ.46,000 దిగువకు, రూ.65,000 వద్ద ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 దిగువకు క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్లోను 1800 డాలర్ల వద్ద ఉన్న బంగారం 1750 డాలర్ల దిగువకు క్షీణించింది. యూఎస్ డాలర్ బలపడటం బంగారం క్షీణతపై ప్రభావం చూపింది. కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక రికవరీ పుంజుకోవడం వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం క్షీణించింది. ఈ ప్రభావం మన మార్కెట్ పైన కనిపించింది. బంగారం 1740 డాలర్ల దిగువకు పడిపోతే మరింత పతనమయ్యే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ ఇండెక్స్ నెల గరిష్టానికి చేరుకుందని, ఇది బంగారంపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ పైన ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.

వడ్డీ ధరలు పెరిగితే
కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుండి దేశీయ మార్కెట్ వరకు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గాయి. దీంతో చాలాకాలంగా ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ వంటి వాటి కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై దృష్టి సారించారు. అయితే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే బంగారంపై ఒత్తిడి తగ్గుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గడం సహజమే.

అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా
భారత్‌లో ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే, ఇక్కడ కూడా తగ్గుతాయి. అమెరికాలో రిటైల్ సేల్స్ ఊహించిన వాటి కంటే బలంగా ఉన్నాయి. దీంతో ట్రెజరీ యీల్డ్స్ పెరిగాయి. ఈ ప్రభావం పడి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మూడు శాతం పడిపోయాయి.
డేటా ఇలాగే బలంగా కొనసాగితే అమెరికా ఫెడ్ ఊహించని దానికంటే ముందుగా తన బాండ్ కొనుగోలు కార్యక్రమాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అంటే అప్పుడు లిక్విడిటీ బయటకు వస్తుంది. ఇది బంగారం ధరల పైన భారీ ప్రభావం చూపుతుంది.
అలాగే, ఈ డేటా బలంగా ఉంటే ఊహించిన దాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఇది బంగారానికి గుడ్ న్యూస్ కాబోదు. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. వడ్డీ ధరలు తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి.


Click it and Unblock the Notifications